లైవ్ సర్జరీ ప్రసారాలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ కొత్త గైడ్ లైన్స్

లైవ్ సర్జరీ ప్రసారాలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ కొత్త గైడ్ లైన్స్
  • హై రిస్క్ సర్జరీల్లో లైవ్ టెలికాస్ట్‌‌‌‌‌‌‌‌కు నిరాకరణ 
  • ఎడ్యుకేషన్ పర్పస్​లో మాత్రమే లైవ్ సర్జరీలకు అనుమతి

హైదరాబాద్, వెలుగు: లైవ్ సర్జరీ ప్రసారాలను నియంత్రించడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్లను కమర్షియల్‌‌‌‌‌‌‌‌గా దోపిడీ చేస్తూ, లైవ్ సర్జరీ ప్రసారాల ద్వారా ఆసుపత్రులు తమ సామర్థ్యాన్ని, సర్జన్లు తమ నైపుణ్యాన్ని, కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రచారం చేస్తూ రోగి భద్రతను పణంగా పెడుతున్నాయని సుప్రీంకోర్టులో రహీల్ చౌదరి తదితరులు రిట్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. 

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ఎంసీ ఒక కమిటీని ఏర్పాటు చేసి, రోగుల భద్రత, ఎథికల్ స్టాండర్డ్స్‌‌‌‌‌‌‌‌ను కాపాడేలా కఠిన రూల్స్ రూపొందించింది. లైవ్ సర్జరీలు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఉపయోగపడాలని, కమర్షియల్ గెయిన్ లేదా ప్రమోషన్ కోసం కాకూడదని ఈ గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్ స్పష్టం చేస్తున్నాయి. గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్ ప్రకారం, లైవ్ సర్జరీలు నిర్వహించే హాస్పిటల్ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కలిగి ఉండాలి. ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌లో ప్రీ-ఆపరేటివ్, అనస్థీషియా, పోస్ట్ -ఆపరేటివ్, ఐసీయూ, లాబొరేటరీ వంటి అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి. 

హై-రిస్క్ సర్జరీలు లేదా అసంపూర్తి ఇన్వెస్టిగేషన్స్ ఉన్న రోగులను లైవ్ సర్జరీలకు ఎంపిక చేయకూడదు.. బదులుగా రికార్డెడ్ వీడియోలను ఉపయోగించాలని ఎన్ఎంసీ సూచించింది. రోగి నుంచి స్పష్టమైన రాతపూర్వక కాన్సెంట్ తీసుకోవాలి. ఇందులో సర్జరీ రిస్క్‌‌‌‌‌‌‌‌లు, ప్రయోజనాలు, గోప్యత చర్యలు వివరించాలి. లైవ్ సర్జరీలకు స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా ఎన్ఎంసీ నుంచి అవసరమైన అప్రూవల్ తప్పనిసరి. 

విదేశీ మెడికల్ ప్రాక్టీషనర్స్ (ఎఫ్ఎంపీ) అయితే, 

ఎన్ఎంసీ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు నుంచి తాత్కాలిక అనుమతి అవసరం. ఒక అపెక్స్ కమిటీ ఎథికల్ గైడ్‌‌‌‌‌‌‌‌ లైన్స్, సేఫ్టీ ప్రోటోకాల్స్, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్‌‌‌‌‌‌‌‌ను పర్యవేక్షించాలి. సర్జన్లు, నిర్వాహకులు రోగి భద్రతకు అత్యధిక ప్రయారిటీ ఇవ్వాలని, సర్జరీ సమయంలో ప్రేక్షకులతో ఇంటరాక్ట్ చేయకుండా రోగి సేఫ్టీపై ఫోకస్ చేయాలని ఎన్ఎంసీ నిర్దేశించింది.