సీఎస్, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

సీఎస్, డీజీపీలకు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
  • గుర్రంపోడు ఘటనపై వివరాలివ్వాలని ఆదేశం

సూర్యాపేట, వెలుగు: గుర్రంపోడులో ఎస్సీల మీద జరిగిన లాఠీచార్జి ఘటనపై వివరాలివ్వాలంటూ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్కు నేషనల్ ఎస్సీ కమిషన్ బుధవారం నోటీసులిచ్చింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా పరిధిలోని 540 సర్వే నెంబర్ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలివ్వాలనే డిమాండ్తో బీజేపీ పోరాటం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న గుర్రంపోడులో చేపట్టిన గిరిజన భరోసా యాత్ర ఉద్రిక్తంగా మారింది. 540 సర్వే నంబర్లో అక్రమంగా నిర్మించిన షెడ్డును కూల్చేందుకు బీజేపీ లీడర్లు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్తో సహా 32మందిపై కేసు నమోదు చేసి, 21మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న మరికొంత మంది ఎస్సీలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన బాధితుడు పత్తిపాటి విజయ్ సహా పలువురు ఈ నెల 1న ఢిల్లీలోని నేషనల్ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. స్పందించిన కమిషన్.. కేసు నిందితుల వివరాలు, బాధితులకు ఇచ్చిన పరిహారం వివరాలు 15రోజుల్లో తమకు తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొంది.