భూసారాన్ని గుర్తించేందుకు  సాయిల్ మ్యాపింగ్

భూసారాన్ని గుర్తించేందుకు  సాయిల్ మ్యాపింగ్
  • సాగు భూముల్లో మట్టి సేకరణ 
  • రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ ఆధ్వర్యంలో పరీక్షలు
  • ఫైలట్ గా ఆరు జిల్లాలో సేకరణ 
  • ఒక్కో రూరల్ మండలంలో 30 నుంచి 35 శాంపిల్స్ 

యాదాద్రి, వెలుగు : భూసారాన్ని గుర్తించి,  ఏ పంట వేయొచ్చో తెలుసుకునేందుకు జిల్లాలో అధికారులు సాయిల్​ మ్యాపింగ్​ మొదలు పెట్టారు.  కేంద్ర    నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ ఆధ్వర్యంలో 'నేషనల్​ సాయిల్​ మ్యాపింగ్' ప్రోగ్రామ్​ ను ఐదేండ్లకు ఒకసారి నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే  తెలంగాణలోని యాదాద్రి, జనగామ, వరంగల్​, హనుమకొండ, మహబూబాబాద్​, సిద్దిపేట జిల్లాలను నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ (ఎన్​ఆర్​ఎస్​ఈ) ఎంపిక చేసింది. శాటిలైట్ ద్వారా ఆయా జిల్లాల్లోని రూరల్​ మండలాల్లో 30 నుంచి 35 చోట్ల  వ్యవసాయ భూములను ఎంపిక చేశారు.

ఒక్కో మండలంలో ఎంపిక చేసిన ప్రతీ చోటుకు సీరియల్​ నెంబర్​, మ్యాపింగ్​ యూనిట్​కు కోడ్, పాయింట్​ నెంబర్​ ఇస్తున్నారు.  యాదాద్రి జిల్లాలోని​ అడ్డగూడూరు మండలంలోని చిన్న పడిశాలలోని ఓ ప్రాంతానికి  సీరియల్​ నెంబర్​ 386, మ్యాపింగ్​ యూనిట్​ GRP27e1C1,  పాయింట్​ నెంబర్​ YDB 386AUGR  కోడ్​ కేటాయించారు. యాదాద్రి జిల్లాలో మొత్తం  406  మ్యాపింగ్​ యూనిట్లకు కోడ్​ ఇచ్చినట్టుగానే మిగిలిన ఐదు జిల్లాల్లో  
కేటాయించారు. 

మూడు లేయర్లుగా మట్టి సేకరణ

గుర్తించిన ప్రతి ప్రాంతంలో నాలుగు ఫీట్ల వెడల్పు, పొడవులో మీటరున్నర లోతులో గొయ్యిని తవ్వుతారు.  ఇందులో  పై భాగం, మధ్య భాగం, అడుగు భాగం నుంచి మూడు లేయర్లలో  విభజించి శాంపిల్​గా మట్టిని వేర్వేరుగా సేకరిస్తారు. సేకరించిన మట్టి నమూనాలను ఎన్​ఆర్​ఎస్​సీకి పంపిస్తారు. అక్కడ నుంచి నేషనల్​ సాయిల్​ మ్యాపింగ్​ (ఎన్​ఎస్​ఎంపీ)పంపించిన తర్వాత అక్కడి శాస్త్రవేత్తలను మట్టి నమూనాలను టెస్టింగ్​ చేసి భూమిలో సారాన్ని గుర్తిస్తారు. అదే విధంగా మట్టిలో తేమ శాతం, ఎంత లోతుల్లో నీటి నిల్వలున్నాయో లెక్కిస్తారు. భూముల సారం, ఏ పంటకు అనుకూలంగా ఉన్నాయి, ఈ భూముల్లో ఎలాంటి పంటలను పండించాలో సూచిస్తుంది. దీనికి అనుగుణంగా  అగ్రికల్చర్​ వర్సిటీ ఆధ్వర్యంలో కొత్తరకం వంగడాలను రూపొందించి, ఆ విత్తనాలను ఈ భూముల్లో సాగు 
చేసి పరీక్షిస్తారు. 

రైతులు సహకరించాలి: భూసారాన్ని పరీక్షించడానికి చేపట్టిన మట్టి సేకరణకు రైతులు సహకరించాలి. భూమిలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎలాంటి పంటల సాగు చేయాలో శాస్త్రజ్ఞులు గుర్తిస్తారు. అందుకనుగుణంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించవచ్చు. -వెంకట రమణ,సీపీవో, యాదాద్రి జిల్లా

ఎన్​ఆర్​ఎస్​సీ గుర్తించిన జిల్లాలు, మండలాలు, మట్టిని సేకరించే ప్రాంతాల వివరాలు

జిల్లా            మండలాలు సంఖ్య    సేకరించే 
                                                              ప్రాంతాలు

యాదాద్రి           17                                      406

జనగామ             12                                      360

వరంగల్​            13                                      400

హన్మకొండ         14                                      400

మహబూబాబాద్18                                      485

సిద్దిపేట             26                                      400