
ఏపీలో రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అమరావతిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆరా తీసింది. ఆదివారం జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కాంచన కట్టర్, ప్రవీణ్‌సింగ్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తుళ్లూరు, మందడంలో మహిళా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. రాజధాని మహిళలు కమిషన్ ముందు తమ గోడును చెప్పుకున్నారు. పోలీసులు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అర్ధరాత్రి ఇళ్లలోకి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించేందుకు పాదయాత్రగా వెళుతున్న తమపై దాడి చేశారని చెప్పారు. అమరావతి గ్రామాల్లో వేల మంది పోలీసులు తిష్ట వేశారని తెలిపారు. రోడ్డుపైకి వస్తే అరెస్టులు చేస్తామని ప్రతి రోజు మైకుల్లో ప్రకటిస్తున్నారని, దీంతో కనీసం నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన మహిళలు కమిషన్ సభ్యులకు దెబ్బలు చూపించి కన్నీటి పర్యంతమయ్యారు. విజయవాడలో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే వేలాది మహిళలను పశువుల్లాగా లాగి లారీల్లో పడేశారని వాపోయారు. విజయవాడ ఏఆర్ గ్రౌండ్లో 2 వేల మంది మహిళలను సాయంత్రం 6 గంటల తరువాత కూడా నిర్భందించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీస సదుపాయాలు లేక మగ పోలీసుల మధ్య తాము నరకయాతన అనుభవించామని నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పుకున్నారు. మహిళలపై అన్యాయంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు రెండ్రోజుల క్రితం తుళ్లూరు నుంచి విజయవాడ వరకు మహిళలు పాదయాత్ర చేపట్టారు. వేల సంఖ్యలో పాల్గొన్న మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పలువురు మహిళలు గాయపడ్డారు. పోలీసుల తీరుపై టీడీపీ సహా రాజధాని మహిళలు జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన మహిళా కమిషన్ ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ బృందాన్ని ఏపీకి పంపింది.
కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం: టీడీపీ
రాజధాని మహిళలపై పోలీసుల దాడికి సంబంధించి జాతీయ మహిళా కమిషన్ కు ఎంపీ గల్లా జయదేవ్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను అందించింది. పోలీసుల దౌర్జన్యంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలవాలని కోరారు. ఏపీ రాజధాని పరిణామాలపై త్వరలోనే కేంద్ర హోం మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని ఎంపీ గల్లా తెలిపారు.