Good Health : నాటుకోడి గుడ్లు.. ఎదిగే పిల్లలకు బూస్టింగ్ ఎనర్జీ

Good Health : నాటుకోడి గుడ్లు.. ఎదిగే పిల్లలకు బూస్టింగ్ ఎనర్జీ

పల్లె జీవనంలో నాటు కోడి ప్రత్యేకం. ఈ కోడి కూస్తేనే పల్లె నిద్ర లేచేది. అయితే, ఇదంతా ఒకప్పటి మాట. పల్లె సీమల జీవనచిత్రం మారుతుండటంతో కోడి కూత కూడా వినిపించడం లేదు. ఇప్పుడు కోళ్లు కనిపించని గ్రామాలు కూడా ఉన్నాయి. దీంతో నాటు కోడితో దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్న పల్లె వాసులు కూడా బ్రాయిలర్ కోళ్ల వెంట పడుతున్నారు.

పండుగొచ్చినా.. ఇంటికి చుట్టాలొచ్చినా.. నాటుకోడి పులుసు వండి పెట్టాల్సిందే. ఒకప్పుడు ప్రతి ఇంట్లో పదుల సంఖ్యలో కనిపించే నాటుకోళ్లు కనిపించేవి. అయితే, ప్రస్తుతానికి ఒకటి, రెండుకు మించడం లేదు. మార్కెట్లో నాటుకోళ్లకు డిమాండ్ ఉన్నా.. గ్రామాల్లో వీటి పెంపకం పెద్దగా లేదు. కోడి గుడ్లు ధరలు ఎక్కువగా ఉన్నా. కొనుక్కుంటున్నారు. కోళ్లు ఎక్కువగా పెంచే పేద, మధ్య తరగతి కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి.

 నాటుకోడి గుడ్డులో పోషకాలు

నాటుకోడి గుడ్డులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో దృష్టి లోపాలు రాకుండా చేస్తాయి. అంతేకాదు బ్రాయిలర్ కోళ్ల కంటే నాటుకోడి మాంసం రుచిగా ఉంటుంది. ఉడికించిన గుడ్డు చాలా మంచిది. అన్ని వయసుల వారికి కావాల్సిన పోషణాలు దీనితో అందుతాయి. ప్రతిరోజు ఆహారంలో గుడ్డు తీసుకుంటే ప్రొటీన్లు, విటమిన్లు, పోషకాలు శరీరానికి ఎక్కువగా అందుతాయి. గుడ్డులో మూడు అత్యవసర ఎమైనో ఆమ్లాలు. ఉంటాయి. వీటిని శరీరం సొంతంగా తయారు చేసుకోలేదు. కాబట్టి గుడ్డుతో వీటిని పొందొచ్చు.

ఎదిగే పిల్లలకు అన్నం, పప్పుతో పాటు పాలు, గుడ్డు కూడా అందించాలి. పెద్దవాళ్లలో కండరాలు క్షీణించకుండా గుడ్డు ఉపయోగపడుతుంది. అలాగే హార్మోన్ల విడుదలకు, ఎంజైమ్ల తయారీ కోసం అవసరమయ్యే ప్రొటీన్లు గుడ్డుతో అందుతాయి. పిల్లలతో పాటు గర్భిణులు తప్పనిసరిగా రోజుకు ఒక గుడ్డు తినాలని డాక్టరు చెబుతారు. 

తక్కువ కావడానికి కారణాలు.. 

పల్లెల్లో దారిద్ర్యరేఖకు దిగువన ఉండే కుటుంబాల ఆదాయం ఈ మధ్య పెరిగింది. అంతేకాకుండా నాటుకోళ్లు పెంచే రైతులకు ఆదాయం తక్కువగా ఉంటోంది. ఎక్కువగా దళారులు లాభపడుతున్నారు. ఈ మధ్య నాటు గుడ్లను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. దీంతో పొదిగించడం. తగ్గిపోయింది. వీటికి తోడు పల్లెల్లో గుడ్లను పొరిగించేందుకు కోళ్లకు అనువైన స్థలాలు కరువయ్యాయి.