ఎంపీ నవనీత్ రానా దంపతులకు రిలీఫ్

ఎంపీ నవనీత్ రానా దంపతులకు రిలీఫ్

మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు రిలీఫ్ దొరికింది. ముంబై సెషన్స్‌ కోర్టు వారికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తుపై విడుదల చేయాలని జస్టిస్ ఆర్ఎన్ రోకడే ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీడియాతో మాట్లాడవద్దని నవనీత్ కౌర్ దంపతులను న్యాయస్థానం ఆదేశించింది. 

సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామని రానా దంపతులు ప్రకటించారు. వారి ప్రకటనతో ముంబైలో ఉద్రిక్తతతలు చోటు చేసుకునే అవకాశముందన్న కారణంతో పోలీసుల ఏప్రిల్ 23న వారిని అదుపులోకి తీసుకుని బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. తమ అరెస్ట్ చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమన్న వాదనలను రానా దంపతులు కోర్టు ముందుంచారు. నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు తమను అరెస్టు చేశారని, తమ వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయాలన్న ఉద్దేశంతోనే దేశ ద్రోహం కేసు పెట్టారని న్యాయమూర్తికి విన్నవించారు. ఎంపీ వాదనలను పోలీసులు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రానా దంపతులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నవనీత్ రానా దంపతులను విచారణకు పిలవాలంటే 24గంటల ముందు నోటిసులివ్వాలని ముంబై పోలీసులను ఆదేశించారు.