
సముద్రతీరంలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించినందుకు ఓ నేవీ అధికారిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కేరళకు చెందిన లెఫ్టినెంట్ రాహుల్ దలాల్ ఈ నెల 5 వ తేదీ సాయంత్రం తన భార్యతో కలసి కొచ్చిలోని వైపీన్ బీచ్ కు షికారు కోసం వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలోనే సముద్రంలో మునిగిపోతూ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి… రాహుల్ కంటపడ్డాడు.
ఆ పరిసర ప్రాంతాల్లో మరెవరూ లేకపోవడంతో నేవీ అధికారి మరేమీ ఆలోచించకుండా వెంటనే అతణ్ని కాపాడేందుకు సముద్రంలోకి దూకారు. అప్పటికే నీటిలో భయంతో వణికిపోతున్న ఆ బాధితుడు.. రాహుల్ రాగానే ఒక్కసారిగా అతన్ని చుట్టేయడంతో ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.
అయినా ఆ అధికారి ధైర్యంగా.. తన బలాన్నంతా కూడగట్టుకొని.. అతన్ని భుజాలపై వేసుకొని… అలలకు ఎదురీదుకుంటూ తీరం వైపు వచ్చారు. స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని తీరానికి చేర్చారు. సముద్రంలో అలలు బలంగా ప్రవహించడంతో ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చేందుకు రాహుల్ దలాల్ కు దాదాపు 25 నిమిషాలు పట్టింది.
అప్పటికే అపస్మారక స్థితికి వెళ్లిన ఆ వ్యక్తికి దలాల్ శ్వాసను అందించి, ప్రథమ చికిత్స చేసి ప్రాణం కాపాడారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తిని ఔరంగబాద్ కు చెందిన దిలీప్ కుమార్ గా గుర్తించారు. నేవీ అధికారి రాహుల్ దలాల్ చేసిన ఈ సాహసానికి సోషల్ మీడియాలో జనం ప్రశంసిస్తున్నారు.