
- రూపాయి చొప్పున డిస్కౌంట్‌తో అమ్ముతున్న నయారా ఎనర్జీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలు, డీజిల్ రిటెయిల్ విక్రయాలు చేస్తున్న ప్రైవేటు కంపెనీలు రేట్లు తగ్గిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్– బీపీ పీఎల్‌సీల భాగస్వామ్య సంస్థ ఇప్పటికే రేట్లను తగ్గించగా, తాజాగా మరో కంపెనీ నయారా ఎనర్జీ ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల రేటు కంటే రూపాయి తక్కువకే పెట్రోలు, డీజిల్‌ను అమ్ముతోంది. గ్లోబల్‌గా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆ బెనిఫిట్‌ను కస్టమర్లకు ఇంకా అందించడం లేదు. కానీ, ప్రైవేటు రంగంలోని కంపెనీలు బెనిఫిట్‌ను కస్టమర్లకు అందిచడం మొదలు పెట్టాయి. జూన్ నెల చివరి దాకా తమ అవుట్లెట్లలో రూపాయి డిస్కౌంట్‌ను కస్టమర్లకు అందిస్తున్నట్లు నయారా ఎనర్జీ ప్రకటించింది.
డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచడంతోపాటు,లోకల్ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఆలోచనతోనే తక్కువ రేట్లకే అమ్ముతున్నట్లు పేర్కొంది. దేశంలోని 86,925 పెట్రోల్పంపులలో 7 శాతం పంపులు ఈ కంపెనీ నిర్వహణలో ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ సహా 10 రాష్ట్రాలలో రూపాయి డిస్కౌంట్‌తో పెట్రోలు, డీజిల్‌లను కంపెనీ సేల్ చేస్తోంది. రిలయన్స్– బీపీ జాయింట్ వెంచర్ఒక్క డీజిల్‌ను మాత్రమే పీఎస్‌యూల కంటే తక్కువ రేటుకు అమ్ముతోంది. గ్లోబల్‌గా చమురు రేట్లు తగ్గుముఖం పట్టినప్పటికీ, గతంలోని నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత 14 నెలలుగా రేట్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు.