- సమ్మె చేస్తున్న కార్మికులను రెచ్చగొట్టారు.
- పదవులన్నీ అనుభవించాక కవితకు తెలంగాణ గుర్తొచ్చిందా?
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో సమ్మెలు జరిగే క్రమంలో ఆత్మహత్యలు చేసుకునేలా రెచ్చగొట్టే పార్టీలున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి మండిపడ్డారు. అలాంటి పార్టీల తీరుతోనే శంకర్ గౌడ్ సూసైడ్ చేసుకున్నాడని ఆరోపించారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్‍లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మహత్యలను ప్రొత్సహించిన అగ్గిపెట్టే రాజులు ఇప్పటికీ వెనకాల ఉన్నారన్నారు. రెచ్చగొట్టే వారింట్లో ఏ ఒక్కరూ చావరని.. ఇతరులను బలి తీసుకుంటారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్య నేపథ్యంలో బీజేపీ, బీఆర్‍ఎస్‍లు పోటీపడి శవరాజకీయాలు చేశారే తప్ప వారి కుటుంబానికి రూపాయి ఆర్థికసాయం చేయలేదన్నారు. శంకర్ అంతిమయాత్రలో బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థాయిలో వచ్చి దిగజారుడు రాజకీయాలు చేశాడే తప్పితే ఒక్క రూపాయైన ఇచ్చావా? అంటూ ప్రశ్నించారు.
బాధితుడి శవాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి వ్యవహరించిన తీరు చూసి బాధితుడి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నేతలు, గ్రామస్తులు నవ్వుకున్నారని తెలిపారు. బీఆర్‍ఎస్ హయాంలో ఆర్టీసీకి రూపాయి నిధులైనా ఇచ్చారా? అంటూ నిలదీశారు. బీఆర్‍ఎస్ సర్కార్ 30 మంది ఆర్టీసీ కార్మికులను పొట్టనబెట్టుకుందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆర్టీసీ ఆస్తులను అమ్మిందే బీఆర్‍ఎస్ పార్టీ అని.. వరంగల్, కరీంనగర్లో టైర్ రిట్రేడింగ్ ఆస్తులను ప్రైవేటోళ్ల చేతిలో పెట్టారని ఫైర్ అయ్యారు. సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు ఇతర ఉద్యోగుల మాదిరిగా సగం జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు అనుభవించిన కవితకు ఈరోజు అసలైన తెలంగాణ గుర్తుకు వచ్చిందా? అని నాయిని ప్రశ్నించారు. పదవులన్నీ అనుభవించిన కవిత ఇప్పుడు 20 మంది పేమెంట్ బ్యాచ్‍ను వెంటేసుకొని విద్య, వైద్యం అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.

