
మలయాళ హీరోయిన్ అయినా పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు, తమిళ భాషల్లోనూ కనిపించి తనదైన అందంతో ఆకట్టుకుంది నజ్రియా నజీమ్. తెలుగులో నానికి జంటగా ‘అంటే సుందరానికీ’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆ చిత్రానికి ఆశించినంత విజయం దక్కలేదు. దీంతో ఆమెకు ఇక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తను చివరిగా నటించిన మలయాళ మూవీ ‘సూక్ష్మదర్శిని’కి ఇతర భాషల్లోనూ సక్సెస్ టాక్ వచ్చింది.
తాజాగా నజ్రియా ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ రూపొందిస్తున్న తమిళ, మలయాళ బైలింగ్విల్ మూవీలో నజ్రియాను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. జీతూ మాధవన్ గత చిత్రం ‘ఆవేశం’ కాగా, ఇందులో ఫహాద్ ఫజిల్ హీరోగా నటించాడు. ఆ చిత్రానికి ఫహాద్ భార్య నజ్రియా నిర్మాతగా వ్యవహరించింది. ఆ సమయంలోనే సూర్యతో రూపొందిస్తున్న కథను చెప్పగా ఇందులో నటించడానికి నజ్రియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీపై అఫిషీయల్ అనౌన్స్‌మెంట్ రానుందని సమాచారం.