ఆర్యన్​ను తప్పించేందుకు 25 కోట్లు అడిగిన్రు

ఆర్యన్​ను తప్పించేందుకు 25 కోట్లు అడిగిన్రు
  • పరారీలో ప్రైవేట్​ డిటెక్టివ్​ గోసావి

ముంబై: క్రూయిజ్​ షిప్​లో డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైలులో ఉన్న ఆర్యన్​ ఖాన్​ను తప్పించే ప్రయత్నం జరిగిందని ప్రధాన సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ఇందుకోసం ఆర్యన్​ తండ్రి షారుఖ్​ ఖాన్​ను రూ.25 కోట్లు డిమాండ్​ చేశారని ఆరోపించాడు. క్రూయిజ్​ షిప్​లో నార్కోటిక్స్ కంట్రోల్​ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు దాడి చేసినపుడు ప్రైవేట్​ డిటెక్టివ్​ కేపీ గోసావి, ఆయన బాడీగార్డు ప్రభాకర్​ సెయిల్ అక్కడే ఉన్నారు. ఈ కేసులో ఆయనను ప్రధాన సాక్షిగా అధికారులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో ఆర్యన్​ను తప్పించే ప్రయత్నం జరిగిందని ఆదివారం  సెయిల్​ మీడియాతో చెప్పాడు. ఆర్యన్​ తండ్రి షారుఖ్​తో డీల్​ కుదుర్చుకునేందుకు గోసావి, ఎన్సీబీ అధికారి ఒకరు ప్రయత్నించారని చెప్పారు. రూ.25 కోట్లు డిమాండ్​ చేసి, రూ.18 కోట్లకు డీల్​ కుదిరేలా చూస్తానని సదరు అధికారితో  గోసావి ఫోన్​లో చెప్పారన్నాడు. అందులో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడేకు అందజేస్తానని గోసావి వివరించాడని సెయిల్​ తెలిపాడు. ఇదంతా తన కళ్ల ముందే జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నాడు. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న తనతో తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారని ఎన్సీబీ అధికారులపై ఆరోపణలు గుప్పించాడు. కాగా, ప్రైవేట్​ డిటెక్టివ్​గా చెప్పుకుంటున్న గోసావి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయనపై పోలీసులు లుక్​ఔట్​ నోటీసులు జారీచేశారు. ఎన్సీబీ ఆఫీసులో ఆర్యన్​ ఖాన్​తో గోసావి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఫొటోలు అప్పట్లో సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. తాజాగా ఎన్సీబీ ఆఫీసులో ఉన్న ఆర్యన్​తో గోసావి ఫోన్​ మాట్లాడిస్తున్న వీడియోను సెయిల్​ మీడియాకు అందజేశాడు.

తప్పుడు ఆరోపణలు: ఎన్సీబీ

లంచం ఆరోపణలను ఎన్సీబీ కొట్టిపారేసింది. సెయిల్​ చెప్పేవన్నీ అబద్ధాలేనని, సంస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అధికారులు చెప్పారు. మరోవైపు, క్రూయిజ్​ షిప్​ డ్రగ్స్ కేసే ఫాల్స్ కేసని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. సెయిల్​ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సిట్​తో విచారణ జరిపించాలని మంత్రి డిమాండ్​ చేశారు.