
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫల్ శరత్ పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్సీపీ ఇవాళ ప్యానెల్ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీ పవార్ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించింది. కమిటీ దక్షిణ ముంబయిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయింది. ఇందులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ సభ్యులుగా ఉన్నారు.
క్యాడర్ నుంచి పెరిగిన ఒత్తిడి..
పదవీ విరమణపై పవార్ తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలు, క్యాడర్ని షాక్‌కి గురి చేసింది. పవార్నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని క్యాడర్ ఒత్తిడి పెంచింది. స్పందించిన పవార్ పునరాలోచించి రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఇదే క్రమంలో ఇవాళ జరిగిన ప్యానెల్ సమావేశలో పవార్ రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ప్రఫుల్ పటేల్ చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయనను అభ్యర్థించాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
3 రోజుల క్రితం రాజీనామా..
దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తామంటే తాము ఒప్పుకోబోమని ప్రఫుల్ పటేల్ అన్నారు. కాగా 3 రోజుల క్రితం ఎన్సీపీ చీఫ్‌గా శరద్ పవార్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.