
- మ్యాజిక్ ఫిగర్‌కు 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ
- గత ఎన్నికలతో పోల్చితే 63 సీట్లు మైనస్..
- దెబ్బకొట్టిన యూపీ.. ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బిహార్
- భారీగా పుంజుకున్న కాంగ్రెస్.. సీట్లు డబుల్
- ఎన్డీయేకు 293.. ఇండియా కూటమికి 233
‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ నినాదం బెడిసికొట్టింది. బలం, బలగం ఉందనుకున్న రాష్ట్రాలు మర్లవడ్డయ్. ఆ దెబ్బకు.. ఊహల్లో నుంచి బీజేపీ గ్రాఫ్ నేలకు దిగివచ్చింది. ప్రజా తీర్పు ముందు కమలం పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది. తమకు ఎదురే లేదని, ఒంటరిగానే 370 సీట్లు దక్కించుకుంటామన్న బీజేపీని మ్యాజిక్ ఫిగర్(272 సీట్ల)కు 32 సీట్ల దూరంలో ఓటర్లు నిలబెట్టారు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని 293 సీట్ల దగ్గర్నే ఆపేశారు. ఎన్డీయేకు తిరిగి అధికారం అప్పగిస్తూనే.. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమికి గౌరవప్రదమైన సీట్లను ఓటర్లు అందజేశారు. మొత్తానికి బీజేపీకి గెలిచినా ఓడినంత పనైంది. కాంగ్రెస్‌కు మాత్రం ఓడినా గెలిచినంత సంబురం దక్కింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నుంచి ‘హమ్మయ్య.. బచ్‌గయా’ అనే పరిస్థితి బీజేపీకి ఎదురైంది. ఆ పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికి 293 సీట్లు మాత్రమే దక్కాయి. ఇది గత ఎన్నికల (352)తో పోలిస్తే 59 సీట్లు తక్కువ. ప్రస్తుతం బీజేపీ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు సాధించిన ఆ పార్టీ.. ఇప్పుడు 240కి పరిమితమైంది. పదేండ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీయేకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గట్టి పోటీని ఇచ్చింది. ముఖ్యంగా యూపీలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో నెలన్నరోజుల పాటు ఎన్నికలు జరగగా.. మంగళవారం ఓట్లను లెక్కించారు.
హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఢమాల్
తనకు మంచి పట్టున్న హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఎదురీదాల్సి వచ్చింది. ముఖ్యంగా 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్‌లో కేవలం 33 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ముఖ్యంగా ఎన్నికలకు కొన్నిరోజుల ముందే అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించినప్పటికీ.. ఆ ఏరియా ఉన్న ఫైజాబాద్ ఎంపీ సీటును కూడా బీజేపీ కోల్పోయింది. మిత్ర పక్షాలతో కలిసి బీజేపీకి వచ్చిన సీట్లు 36 మాత్రమే. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఒక్క బీజేపీనే 62 సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు దాదాపు సగం సీట్లను కోల్పోయింది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అనే నినాదంతో హ్యాట్రిక్ కోసం మోదీ ప్రయత్నించినా.. యూపీలో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా కౌంటింగ్ మొదలైనప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం మోదీ వెనుకంజలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2019తో పోలిస్తే ఇక్కడ మోదీకి మెజార్టీ భారీగా తగ్గింది. 2019లో వారణాసిలో ఆయనకు 4,79,505 మెజార్టీ రాగా.. ఇప్పుడు 1,52,513 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై గెలుపొందారు. ఇక, యూపీలో ఇండియా కూటమి 43 సీట్లు సొంతం చేసుకొని.. ఎన్డీయేకు చుక్కలు చూపించింది. రాజస్థాన్‌లో కేవలం 14 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. గత ఎన్నికల్లో 24 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఈ సారి పది సీట్లు కోల్పోయింది. రాజస్థాన్‌తోపాటు హర్యానాలోనూ బీజేపీకి ఇండియా కూటమి షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్‌కు డబుల్
2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ కేవలం 52 సీట్లు గెలుచుకోగా.. ఈ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచింది. ఎగ్జిట్ పో ల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ఆ పార్టీ దూసుకుపోయింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో ఆ కూటమిలోని భాగస్వామ్యపక్షం సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లను గెలుచుకుంది. అదేవిధంగా కూటమిలోని టీఎంసీ పశ్చిమబెంగాల్లో 29 సీట్లను కైవసం చేసుకుంది. బెంగాల్‌నూ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 18 సీట్లు రాగా.. ఇప్పుడు 12కే పరిమితమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల భారీ మెజార్టీ నమోదు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో 3,90,030.. కేరళలోని వయనాడ్‌లో 3,64,422 మెజార్టీతో విజయం సాధించారు.
మోదీకి సాతిచ్చిన ఏపీ, ఒడిశా, బీహార్
హ్యాట్రిక్ విజయంతో మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించాలని భావించిన మోదీకి.. హిందీ రాష్ట్రాల్లో ఎదురుగాలి వీచింది. అయితే, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలు ఆయనకు అండ గా నిలిచాయి. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా వెళ్లిన బీజేపీ.. 3 సీట్లను కైవసం చేసు కుంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉం డగా.. ఈ ఎన్డీయే కూటమికి 21 సీట్లు వచ్చాయి. పైగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజ యాన్ని నమోదుచేసుకుంది. ఇన్నాళ్లూ అధికా రంలో ఉన్న వైసీపీ వాష్ ఔట్ అయింది. ఒడిశాలో 8 సీట్ల నుంచి 20 సీట్లకు బీజేపీ ఎగబాకింది. ఇక్కడ ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న నవీన్ పట్నా యక్ పార్టీ బిజూ జనతాదళ్ ఘోరంగా ఓడిపో యింది. బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. బీహార్‌లోనూ బీజేపీకి కలిసి వచ్చింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు ఇండియా కూటమిలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆ తర్వాత ఎన్డీయే కూటమిలో చేరారు. అక్కడ ఈ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. కాగా, సౌత్‌లోని తమిళనాడులో ఒక్క సీటును కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. కేరళలో మాత్రం ఫస్ట్‌టైమ్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇక్కి త్రిసూర్‌లో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి, సినీ నటుడు సురేశ్ గోపి విజయం సాధించారు. కర్నాటకలోని మొత్తం 28 సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు రాగా.. ఈసారి 17 సీట్లు వచ్చాయి. దాని మిత్రపక్షం జేడీఎస్‌కు 2 సీట్లు వచ్చాయి. కాగా, ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.