
- ఎన్డీయే ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కామెంట్
రాయ్ బరేలీ (యూపీ): ఓట్ల చోరీకి సంబంధించి విస్ఫోటనం సృష్టించే ఆధారాలను ఇవ్వబోతున్నామని లోక్ సభాపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ గురువారం మరోసారి పునరుద్ఘాటించారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని తన లోక్‌సభ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మహారాష్ట్ర, హర్యానా, కర్నాటక ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. అందుకు సంబంధించి ఈసీకి మేం బలమైన ఆధారాలు అందించాం. రాబోయే కాలంలో మేం విస్ఫోటనం లాంటి ఆధారాలను అందిస్తాం. ఓట్ చోర్, గద్దీ ఛోడ్ నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది.
ఓట్లను చోరీ చేయడం ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయనేది నిజం. అందుకు సంబంధించిన ఆధారాలను మీకు అందిస్తామని మేం గ్యారంటీ ఇస్తున్నాం” అని తెలిపారు. బిహార్ రాజధాని పాట్నాలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర యువత ఈ ప్రభుత్వానికి దాని అసలైన స్థానాన్ని చూపిస్తారని, అందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పారు.