ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ఎన్డీఏ  రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేశారు. ఈవిషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‌

‘‘‌ రక్షణ మంత్రి రాజ్​ నాథ్​ సింగ్​, నేను కలిసి..  ఎన్డీఏ, యూపీఏ కూటములతో చర్చించి, అందరి సర్వ సమ్మతితో ఒక రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నం చేశాం. కానీ సమ్మతి సాధ్యం కాలేదు. యూపీఏ కూటమి ఇప్పటికే రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. దీంతో మేం కూడా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలతో చర్చించి అభ్యర్థిని ఎంపిక చేశాం”అని నడ్డా తెలిపారు.   ‘‘ఇవాళ జరిగిన సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం 20 మంది పేర్లపై చర్చించాం. అయితే ఇప్పటివరకు ఆదివాసీ, గిరిజనులు రాష్ట్రపతి కాలేదు. దీంతో ఆ వర్గం వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిత్వం కోసం ఎంపిక చేశాం. ఆమె విద్యారంగంతో ముడిపడి ఉన్నారు.”అని నడ్డా  వెల్లడించారు.