తమిళనాడుకు వర్ష సూచన.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తమిళనాడుకు వర్ష సూచన.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

తమిళనాడుకు భారీ వర్ష ముంపు పొంచి ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆరు ఎన్టీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.  వర్ష ముంపు పొంచి ఉన్న నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, కడలూరు, మైలాడుతురై, చైన్నైలకు  ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వెళ్లనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో తుఫాన్‭గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. దీని ప్రభావంతో డిసెంబర్ 8న తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

అరక్కోణంలోని కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు వాతావరణ పరిస్థితిని పరిశీలించనున్నారు. IMD అంచనా ప్రకారం, కొమోరిన్ ప్రాంతం నుండి ఉత్తర కేరళ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి ఉంది. ఆ తర్వాత, అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ.. డిసెంబర్ 8 నాటికి ఉత్తర తమిళనాడు, -పుదుచ్చేరి తీరాలకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అలాగే తమిళనాడు తీర ప్రాంతమైన పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్ష సూచన కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.