- 15 రోజుల్లో ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తం.. ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు టెస్టులు లేటవడంపై జైన్ ప్రశ్న
- ఒకసారి డిజైన్స్ టీమ్, ఇన్వెస్టిగేషన్స్ టీమ్ సమావేశమవ్వాలని సూచన
- వర్షాకాలంలోపు టెస్టులు పూర్తి చేయాలని సలహా
- డిజైన్స్ బాధ్యతను ఆఫ్రీకి.. టెస్టుల బాధ్యతను సీడబ్ల్యూపీఆర్ఎస్కు అప్పగించాని వెల్లడి
- కాళేశ్వరం బ్యారేజీలపై ప్రత్యేకంగా రివ్యూ చేసిన ఎన్డీఎస్ఏ చైర్మన్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల టెస్టులు, రిపేర్ల ప్రక్రియపై సలహాలు సూచనలు ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్‌ను ఇరిగేషన్ శాఖ అధికారులు కోరారు. రిపేర్ల ప్రక్రియపై రోడ్ మ్యాప్ ఇవ్వాలని, 15 రోజుల్లో ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు. శుక్రవారం ఈఎన్సీ జనరల్, రామగుండం సీఈ, కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారులతో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
శుక్రవారం ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన సౌత్ స్టేట్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. తాజాగా మేడిగడ్డ, అన్నారం, బ్యారేజీలపై రివ్యూ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్ల ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతున్నదని అనిల్ జైన్ ప్రశ్నించారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తాము రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికే ఏడాది దాటిపోయిందని, అయినా టెస్టుల విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. మూడు బ్యారేజీలపై నిరుడు ఏప్రిల్‌లోనే తాము నివేదిక ఇచ్చినా.. ఇప్పటిదాకా పనులు ఎందుకు లేట్ అవుతున్నాయని ఆయన అధికారులను ప్రశ్నించినట్టు తెలిసింది.
బ్యారేజీలకు పరీక్షలు, డిజైన్ల విషయంలో డిజైన్స్ టీం, ఇన్వెస్టిగేషన్స్ టీం కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎలా ముందుకు వెళ్లాలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. వర్షాకాలానికి ఇంకా ఎన్నో రోజులు లేదని, ఈలోగా టెస్టులు పూర్తవుతాయా? అని ప్రశ్నించారు. చేయాల్సిన స్టడీస్ ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. డిజైన్స్ ఎవరితో చేయిస్తున్నారని, వీలైనంత త్వరగా టెస్టులను పూర్తి చేసి డిజైన్లను రెడీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
2డీ మోడల్ స్టడీస్ చేస్తున్నం..
రిపోర్ట్ వచ్చాక కొన్ని రోజులకే వర్షాకాలం వచ్చేసిందని, దీంతో పరీక్షలు సాధ్యపడలేదని ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు అధికారులు వివరించారు. ఏం చేయాలన్న దానిపై లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రతి విషయం ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని చెప్పారు. డిజైన్ల బాధ్యతను అప్పగించేందుకు నిరుడు ఆగస్టులోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను ఆహ్వానించామని, చాలా సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయని, వాటన్నింటినీ వడబోసి ఆఫ్రీ ఇండియాకు పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతను అప్పగించామని పేర్కొన్నారు.
మరోవైపు బ్యారేజీల వద్ద జియోటెక్నికల్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో చేయిస్తున్నామన్నారు. జనవరి నుంచి టెస్టులు ప్రారంభమయ్యాయని, 2డీ మోడల్ స్టడీస్ వంటివి చేస్తున్నామని వివరించారు. అయితే, ఇసుక భారీగా పేరుకుపోవడంతో అక్కడ జియోటెక్నికల్ టెస్టుల కోసం బోర్‌హోల్స్ తవ్వకం ఇబ్బందిగా మారడంతో.. సీడబ్ల్యూపీఆర్ఎస్ సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఇసుక తోడివేత, బోర్‌హోల్స్ వేసే పనులు జరుగుతున్నాయని వివరించారు. టెస్టుల విషయంలో ఏవైనా సలహాలు ఇవ్వాలని ఎన్డీఎస్ఏ చైర్మన్‌ను అధికారులు కోరారు. తమకు ఓ రోడ్ మ్యాప్ ఇస్తే దానికి అనుగుణంగా టెస్టులు చేస్తామని చెప్పారు. 15 రోజుల్లో తమకు ఓ రోడ్‌మ్యాప్ ఇస్తే.. దాని ప్రకారం పనులు చేస్తామన్నారు. దానికి, ఎన్డీఎస్ఏ చైర్మన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఇక, వానాకాలంలోపు వీలైనంత మేరకు టెస్టులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు చెప్పారు.
నేడు నాగార్జున సాగర్ డ్యామ్ పరిశీలన..
నాగార్జున సాగర్డ్యామ్ను శనివారం పరిశీలించనున్నారు. ప్రీ మాన్సూన్ చెకప్‌లో భాగంగా డ్యామ్ పరిస్థితి, రిపేర్ల వంటి అంశాలపై రివ్యూ చేయనున్నారు.
