మేం అడిగిందేంటి.. మీరిచ్చిందేంటి?

మేం అడిగిందేంటి.. మీరిచ్చిందేంటి?

 

  •     ఇరిగేషన్ అధికారులపై ఎన్డీఎస్ఏ కమిటీ చైర్మన్ సీరియస్  
  •     కాళేశ్వరంపై అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం
  •     ఒక్కో అధికారిని విడివిడిగా పిలిచి వివరాల సేకరణ 
  •     కీలకమైన ఆపరేషన్స్ విభాగంతో జరగని మీటింగ్ 
  •     సమావేశానికి హాజరుకాని మాజీ ఈఎన్సీ మురళీధర్ 

హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నేషనల్ ​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నియమించిన నిపుణుల కమిటీ.. ఇరిగేషన్​అధికారులపై సీరియస్​అయినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్​సమగ్ర స్వరూపంపై వివరాలు ఇవ్వాలని కమిటీ చైర్మన్​చంద్రశేఖర్​అయ్యర్​అడగ్గా, ఆ సమాచారం లేదని అధికారులు చెప్పారని... అలాగే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి అడిగిన సమాచారం కాకుండా వేరేది ఇచ్చారని తెలిసింది. దీంతో అధికారులపై అయ్యర్​ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ‘మేం అడిగిందేంటి.. మీరిచ్చిందేంటి?’ అని ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. అయితే తమ వద్ద అదే సమాచారం ఉందంటూ కొందరు అధికారులు జవాబివ్వగా.. ‘అసలు ఆ రికార్డులు లేకుండా మీరేం చేస్తున్నట్టు?’ అని అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తున్నది. 

గురు, శుక్రవారాల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ.. శనివారం హైదరాబాద్ లోని జలసౌధలో ఇరిగేషన్​ అధికారులతో సమావేశమైంది. తొలుత ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​జీవన్​పాటిల్, ఈఎన్సీలు అనిల్​కుమార్, నాగేందర్​రావులతో భేటీ అయింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో 2016 నుంచి భాగమైన ఇంజనీర్లు, అధికారులందరితోనూ విడిడివిగా సమావేశమై వివరాలు తీసుకుంది. దాదాపు 7 గంటల పాటు సాగిన సమావేశంలో సెంట్రల్​డిజైన్స్​ఆఫీస్​(సీడీవో), క్వాలిటీ కంట్రోల్, ఎగ్జిక్యూషన్, ప్లానింగ్​విభాగాల ఇంజనీర్లు, అధికారులను ఒక్కొక్కరిని పిలిచి ప్రాజెక్ట్​వివరాలను అయ్యర్​అడిగి తెలుసుకున్నారు. ఒక అధికారి ఇచ్చే ఇన్ఫర్మేషన్​మరొకరికి తెలియకుండా అత్యంత సీక్రెట్​గా, పకడ్బందీగా సమాచారం సేకరించారు. చివరకు తెలంగాణ ఈఎన్సీలనూ సమావేశం జరుగుతున్న చాంబర్​లోకి అనుమతించలేదని తెలిసింది. కాగా, ప్రాజెక్టులో భాగమైన వాళ్లందరూ అందుబాటులో ఉండాలని చెప్పినా మాజీ ఈఎన్సీ మురళీధర్​మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. మరో ఈఎన్సీ ఆరోగ్య సమస్యల కారణంగా సమావేశానికి రాలేకపోయారు. అయితే, అవసరమనుకుంటే వాళ్లిద్దరినీ పిలుస్తామని నిపుణుల కమిటీ చెప్పినట్టు తెలిసింది. 

ఓఅండ్ఎంతో జరగని మీటింగ్..  ​

అత్యంత కీలకమైన ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​(ఓఅండ్ఎం) విభాగం అధికారులతో నిపుణుల కమిటీ మీటింగ్ జరగలేదు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీకి ప్రధాన కారణం ఆపరేషన్ అండ్​మెయింటెనెన్స్​లోపాలేనని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, టైమ్ సరిపోకపోవడంతో ఆ విభాగంతో మరో రోజు మీటింగ్ పెట్టాలని కమిటీ నిర్ణయించింది. అధికారులను ఢిల్లీకి రావాలని కమిటీ చైర్మన్ అయ్యర్​సూచించగా, వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘‘ఢిల్లీకి వస్తే పూర్తి సమాచారం అందుబాటులో ఉండదు. కమిటీనే హైదరాబాద్​కు వస్తే పూర్తి సమాచారం, డాక్యుమెంట్లను దగ్గర పెట్టుకునేందుకు వీలుంటుంది. డాక్యుమెంట్లన్నింటినీ ఢిల్లీకి తీసుకురావడం ఇబ్బంది అవుతుంది” అని అధికారులు చెప్పినట్టు తెలిసింది. కాగా, మరోసారి మీటింగ్​ఎప్పుడు? ఎక్కడ? పెట్టా లన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. సమావేశం అనంతరం కమిటీ సభ్యులు ఢిల్లీకి వెళ్లిపోయారు. 

తాత్కాలికంగా ఏం చేయొచ్చు? 

మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలికంగా ఎలాంటి రిపేర్లు చేయొచ్చో చెప్పాలని ఎన్డీఎస్ఏ కమిటీకి తెలంగాణ ఈఎన్సీలు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. వర్షాకాలానికి ముందే తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు వీలైనంత త్వరగా మధ్యంతర రిపోర్ట్​ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ప్రాణహితకు వరద కూడా తొందరగా మొదలవుతుందని, ఈ నేపథ్యంలోనే ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా టెంపరరీ రిపేర్లకు ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుంటుందని ఈఎన్సీలు అభిప్రా యపడినట్టు తెలిసింది. మరోవైపు కమిటీ అడిగిన రిపోర్టులన్నీ ఇచ్చామని ఈఎన్సీలు తెలిపారు. ఇంకేమన్నా రికార్డులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.