కంటి వెలుగులు ఎప్పుడు?

కంటి వెలుగులు ఎప్పుడు?
  • కంటి వెలుగు స్ర్కీనింగ్ ముగిసి 4 నెలలపైనే..
  • ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది
  • 180 హాస్పిటళ్లను గుర్తించినట్టు చెప్పిన సర్కారు
  • గతేడాది ఆగస్టులో కొందరికి ఆపరేషన్లు..
  • కొందరికి వికటించడంతో బంద్​.. వరుస ఎలక్షన్లతో లేటు
  • మళ్లీ అధికారంలోకి వచ్చినా ముందుకు సాగని పథకం

 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ కింద ఆపరేషన్ల కోసం సుమారు పది లక్షల మంది ఎదురుచూస్తున్నారు. కంటి పరీక్షల స్క్రీనింగ్​ ముగిసి నాలుగున్నర నెలలు దాటిపోయినా సర్కారు ఇంకా ఆపరేషన్ల ఊసెత్తడం లేదు. దృష్టి లోపాలున్నట్టు గుర్తించినా కూడా ఐదు లక్షల మందికి ఇంకా కంటి అద్దాలు అందలేదు. దీంతో సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం అర్ధంతరంగానే అటకెక్కినట్టు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. 180 హాస్పిటళ్లను గుర్తించామని, అందరికీ ఆపరేషన్లు చేయిస్తామని సీఎం స్వయంగా ప్రకటించినా ఫలితం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఘనంగా షురూ జేసి..

సీఎం కేసీఆర్​ గతేడాది ఆగస్టు 15న మెదక్‌‌ జిల్లా మల్కాపూర్‌‌‌‌లో ‘కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు. ప్రజలు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే అద్దాలు ఇస్తామని, ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. 40 లక్షల కండ్లద్దాలు సిద్ధం చేశామని, ఆపరేషన్లు చేసేందుకు 180 హాస్పిటళ్లను కూడా గుర్తించామని ప్రకటించారు. దేశంలోనే ఇంకెవరూ చేయని కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. ఆ రోజు నుంచి ఈ ఏడాది మార్చి చివరి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,901 గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి.. 1,54,72,849 మందికి కంటి పరీక్షలు చేసినట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అందులో 1,04,33,854 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని డాక్టర్లు తేల్చారు. 50,38,995 మందికి వివిధ రకాల కంటి సమస్యలున్నట్టు గుర్తించారు. ఇందులో 6,42,290 మందికి క్యాటరాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శుక్లాలు), 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని తేల్చారు.

నెల రోజులకే బంద్..

గతేడాది ఆగస్టులో కంటి పరీక్షలు ప్రారంభించిన వెంటనే.. కొందరిని దవాఖానాలకు తరలించి ఆపరేషన్లు చేయడం ప్రారంభించారు. సుమారు పది లక్షల మందికి ఆపరేషన్లు చేయాలని డాక్టర్లు సూచిస్తే, కనీసం ఐదారు వేల మందికి కూడా జరగలేదు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో కొన్ని చోట్ల ఆపరేషన్లు వికటించాయి. ఆ ఘటనల నేపథ్యంలో ఆపరేషన్లు మొత్తంగా ఆగిపోయాయి. అప్పుడే కేసీఆర్​ సర్కారును రద్దు చేసుకోవడం, వరుస ఎలక్షన్లు రావడంతో కంటి ఆపరేషన్లపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. రెండోసారి టీఆర్ఎస్​ సర్కారు ఏర్పాటయ్యాక కూడా కదలిక రాలేదు. ఉన్నతాధికారులు ఆపరేషన్ల అంశాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్లినా అనుమతి రాలేదు. ఆలోగా మార్చి నెలలో స్ర్కీనింగ్  ముగిసిపోయింది. ఇది జరిగి నాలుగున్నర నెలలవుతున్నా ఏ నిర్ణయమూ రావడం లేదు.

  • ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నవారు 9,59,266
  • క్యాటరాక్ట్​ అవసరమైనవారు 6,42,290
  • పెద్దాపరేషన్​ కావాల్సినవారు 3,16,976
  • ఇంకా కండ్లద్దాలు అందని వారు 4,96,526

కేంద్రం పైసలిస్తోంది

కంటి వెలుగులో చేసే క్యాటరాక్ట్​ ఆపరేషన్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తోంది. లయన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్వీ ప్రసాద్ తదితర సంస్థలు కేంద్ర సర్కారు ఒక్కో ఆపరేషన్ కు ఇచ్చే రూ.2 వేలతోనే చికిత్సలు చేయించేందుకు సానుకూలంగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెప్తున్నాయి. అవసరమైన నిధులుండి, ఆపరేషన్లు చేసేందుకు ఆస్పత్రులు ముందుకొస్తున్నా.. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోలేదు. ఆపరేషన్ల విషయంలో ఒకరిద్దరు ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న బాధితుల్లో కొందరు పరిస్థితి విషమించి కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. కండ్లద్దాల విషయంలోనూ ఇదే విధమైన నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

సగానికిపైగా రీడింగ్​ గ్లాసులే..

పథకం ప్రారంభించేనాటికే 40 లక్షల అద్దాలు సిద్ధం చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు 36,11,501 మందికి అద్దాలు పంపిణీ చేశారు. అయితే ఇందులో 22.93 లక్షలు రీడింగ్ గ్లాసులే. కంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చినవి 13.17 లక్షల అద్దాలే. మొత్తంగా స్క్రీనింగ్​ చేసిన 1.54 కోట్ల మందిలో 18.13 లక్షల మందికి వివిధ స్థాయిల్లో దృష్టి లోపం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధరించారు. వారందరికీ కండ్లద్దాలు ఇవ్వాలని సూచించారు. అంటే ఇంకా 4,96,526 మందికి కండ్లద్దాలు అందలేదు. తమకు ఎప్పుడిస్తారా అని వారంతా ఎదురుచూస్తున్నారు.

కంటి పరీక్షలు చేసిన ఊర్లు: 9,901

మొత్తంగా పరీక్షించినవారి సంఖ్య: 1,04,33,854

సమస్యలున్నట్టు గుర్తించినవారి సంఖ్య: 50,38,995

ఆ హాస్పిటళ్లు ఏవీ?

కంటి వెలుగు పథకం ప్రారంభించేటప్పుడే పెద్ద సంఖ్యలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుందని భావించి, 180 హాస్పిటళ్లను గుర్తించారు. సీఎం కేసీఆరే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. అయితే కొన్నిచోట్ల ఆపరేషన్లు ఫెయిలయ్యాక హైదరాబాద్​లోని సరోజినీ దేవి ఆస్పత్రి మినహా.. మరే హాస్పిటల్​కూ రోగులను తరలించలేదు. లయన్స్‌‌‌‌ క్లబ్‌‌‌‌, ఎల్వీ ప్రసాద్ సహా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆపరేషన్ల బాధ్యతలు అప్పగించాలని భావించినా.. ఆ ఆలోచన కూడా ముందుకు సాగలేదు. దీనిపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా.. సర్కారు నిర్ణయం తీసుకోనంత వరకూ తామేమీ చేయలేమని చెబుతున్నారు.

 

ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్న బాధితులు

జిల్లా                  శుక్లాల  ఆపరేషన్           పెద్ద ఆపరేషన్

 

ఆదిలాబాద్              24,142          13,333

కొత్తగూడెం               22,451          11,999

హైదరాబాద్              22,081          50,034

జగిత్యాల                 11,410          3,484

జనగామ                8,118           2,351

భూపాలపల్లి           13,956          4,165

గద్వాల                13,459          6,236

కామారెడ్డి             41,410          14,530

కరీంనగర్              15,873          6,776

ఖమ్మం               21,066          7,945

ఆసిఫాబాద్             9,760           5,245

మహబూబాబాద్     23,290          10,325

మహబూబ్ నగర్    31,736          10,989

మంచిర్యాల            14,119          5,650

మెదక్                 9,381           4,678

మేడ్చల్              22,783          21,283

నాగర్ కర్నూల్       16,185          5,926

నల్గొండ               38,867          11,756

నిర్మల్                18,528          6,031

నిజామాబాద్        29,677          12,756

పెద్దపల్లి              30,069          10,898

సిరిసిల్ల            11,201          3,087

రంగారెడ్డి          41,121          23,206

సంగారెడ్డి          25,957          13,998

సిద్దిపేట            21,319          10,197

సూర్యాపేట        20,082          8,479

వికారాబాద్       18,443          7,471

వనపర్తి               11,642          6,243

వరంగల్ రూరల్      18,965          6,982

వరంగల్ అర్బన్      22,300          6,781

భువనగిరి               12,899          4,142

మొత్తం                  6,42,290       3,16,976