ఏడున్నర నెలల తర్వాత 14 వేల కేసులే

ఏడున్నర నెలల తర్వాత 14 వేల కేసులే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దాదాపు ఏడున్నర నెలల తర్వాత అతి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఒక్క రోజులో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.39 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. వైరస్ తో మరో 181 మంది చనిపోయారని, ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వాళ్ల సంఖ్య 4,50,963కు పెరిగిందని తెలిపింది. యాక్టివ్ కేసులు కూడా తగ్గాయని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,14,900 మంది బాధితులు మాత్రమే ఉన్నారని చెప్పింది. ఇప్పటి వరకు ఇవే అతి తక్కువని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.63 శాతమేనని పేర్కొంది. గత 24 గంటల్లో 12,447 యాక్టివ్ కేసులు తగ్గాయంది. రికవరీ రేటు 98.04 శాతానికి పెరిగిందని, ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ అని వెల్లడించింది. సోమవారం 11,81,766 టెస్టులు చేశామని, దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58.50 కోట్లకు చేరిందని తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 1.21 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.48 శాతంగా, డెత్ రేటు 1.33 శాతంగా నమోదైందని వివరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3.33 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని చెప్పింది. కొత్తగా నమోదైన మరణాల్లో కేరళలో 84, మహారాష్ట్రలో 36 ఉన్నాయని తెలిపింది. మొత్తం మరణాల్లో మహారాష్ట్రలో 1,39,578, కర్నాటకలో 37,895, తమిళనాడులో 35,796,  కేరళలో 26,342, ఢిల్లీలో 25,089, ఉత్తరప్రదేశ్ లో 22,896, పశ్చిమ బెంగాల్ లో 18,914 ఉన్నాయని చెప్పింది. కాగా, వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 95.89 కోట్ల టీకా డోసులను వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

రష్యాలో మరణాలు పెరుగుతున్నయ్

రష్యాలో కరోనా కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం 28,190 కేసులు, 973 డెత్స్ నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇవే హయ్యెస్ట్ డెత్స్ అని అధికారులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 78 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 2,18,345 డెత్స్ రికార్డయ్యాయి. స్లో వ్యాక్సినేషన్ రేటు కారణంగానే దేశంలో కేసులు, డెత్స్ పెరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రష్యాలో 14.6 కోట్ల మంది ఉండగా, వారిలో 4.78 కోట్ల మంది (33 శాతం) కనీసం ఒక్క డోసు వేసుకున్నారు. 4.24 కోట్ల మంది (29 శాతం) రెండు డోసులూ వేసుకున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ రష్యా ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా లోకల్ గవర్నమెంట్లే నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.