NED vs SL: మరోసారి పోరాట పటిమచూపిన నెదర్లాండ్స్.. లంకేయుల దారెటు..?

NED vs SL: మరోసారి పోరాట పటిమచూపిన నెదర్లాండ్స్.. లంకేయుల దారెటు..?

వన్డే ప్రపంచ కప్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు మరోసారి పోరాట పటిమ చెపారు. లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో లంకేయుల ముందు 263 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్.. 150 దాటడమే గగనమనుకుంటే ఏకంగా 262 పరుగులు చేయడం గమనార్హం. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన నెదర్లాండ్స్ బ్యాటర్లు.. లంక బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. విక్రమ్‌జీత్ సింగ్ (4), మ్యాక్స్ ఓడ్ (16), అకర్‌మన్ (29), బాస్ డీ లీడ్ (6), తేజ నిడమనూరు (9), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (16).. ఇలా వెంటవెంటనే పెవిలియన్ చేరిపోయారు. 22 ఓవర్లు ముగిసేసరికి నెదర్లాండ్స్ స్కోర్.. 91/6. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఎంగిల్‌బ్రెచ్‌, లోగ‌న్ వాన్ బీక్ సౌతాఫ్రికా మ్యాచ్ గుర్తొచ్చింది. 

ప్రొటీస్ జట్టుపై 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. 245 పరుగులు చేశారో.. లంకతో మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ చేశారు. ఏడో వికెట్‌కు ఏకంగా 130 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఎంగిల్‌బ్రెచ్ 82 బంతుల్లో 70 పరుగులు చేయ‌గా, వాన్ బీక్ 75 బంతుల్లో 59 పరుగులు చేశాడు. లంక బౌల‌ర్లలో ర‌జిత, మ‌ధుశంక‌ చెరో 4 వికెట్లు తీసుకోగా..తీక్షణ ఒక వికెట్ పడగొట్టాడు.

 లంకేయుల దారెటు..?

ఈ టోర్నీలో లంక ఇప్పటివరకూ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు.. సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో లంకేయులు దారెటో తెలియాలంటే మరికొంత సేపు వేచి ఉండాలి.