సరిహద్దు చెక్​పోస్టుల్లోనే డ్యూటీ కావాలి​!

సరిహద్దు చెక్​పోస్టుల్లోనే డ్యూటీ కావాలి​!
  •     రాష్ట్ర రవాణా శాఖలో ఈ పోస్టుకు విపరీతంగా డిమాండ్
  •     రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు
  •     ఇక్కడ కాసుల పంట పండటమే కారణమని ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రవాణాశాఖ (ఆర్టీఏ)లో  కొన్నిపోస్టులకు విపరీతంగా డిమాండ్​ఉంటున్నది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్​ పోస్టుల్లో డ్యూటీల కోసం ఎంతో మంది అధికారులు, ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఇక్కడ డ్యూటీ చేసినవారికి కాసుల పంట పండుతుండటంతోనే ఇంత డిమాండ్​ ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. దీంతో రాజకీయ పలుకుబడితో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఇక్కడ పోస్టింగ్​లు వేయించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. 

ఇటీవల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర రవాణాశాఖలో కొన్ని మార్పులు తీసుకువస్తున్నది. అందులో భాగంగానే కొందరికి ప్రమోషన్లు ఇస్తుండగా, మరికొందరి పై బదిలీ వేటు వేస్తున్నది. దీంతో చాలామంది ఉద్యోగులు చెక్​పోస్టుల వద్దనే డ్యూటీల కోసం పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఓడీలను(ఆన్​డ్యూటీలను) రద్దు చేయడంతో పలువురు ఉద్యోగులు తమ యథాస్థానాలకు వెళ్లిపోయారు. అయితే, ఇటీవల కొందరు ఉద్యోగులు పెద్ద ఎత్తున పైరవీ చేసుకుని మళ్లీ చెక్​పోస్టుల వద్ద డ్యూటీకి అనుమతులు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. 

 ఈ నేపథ్యంలోనే ఆయా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల నుంచి వచ్చే మామూళ్లకు అలవాటు పడిన పలువురు ఉద్యోగులు మరోసారి చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్దే తమకు పోస్టింగ్‌‌‌‌‌‌‌‌లు వచ్చేలా లాబీయింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రుల వద్దకు సిఫారసు లెటర్ల కోసం రవాణా శాఖ ఉద్యోగులు క్యూ కడుతున్నట్టు తెలిసింది. తమకు అనుకూలమైన పోస్టింగ్ ఇప్పించాలని ఒత్తిడి చేస్తున్నట్టు  సమాచారం. 

రాష్ట్ర సరిహద్దుల్లో చెక్​పోస్టులు కీలకం

ఆర్టీఏ శాఖలో ఉద్యోగం చేసే చాలా మంది అధికారులు అప్పుడప్పుడు చెక్​పోస్టుల వద్ద డ్యూటీలు వేయించుకుంటారు. దీనికి కారణం పెద్ద ఎత్తున రాబడి ఉండటమేనని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18 చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఆర్టీఏకు  సంబంధించినవి ఉన్నాయి. ప్రతినిత్యం ఆయా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల ద్వారా వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేయడం అక్కడి సిబ్బంది విధి. కానీ కొందరు అధికారులు, సిబ్బంది మాత్రం ఇక్కడ డ్యూటీ చేసే సమయంలో మిలాఖత్​ అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

  ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారి పై గతంలోనూ ఏసీబీ అధికారులు దాడులు చేసి, అక్కడ పనిచేసే ఉద్యోగుల నుంచి అవినీతి సొమ్మును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలుమార్లు ఏసీబీ అధికారులు పలు చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద దాడులు చేసినా అక్కడ అవినీతి మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. లంచాలకు  అలవాటు పడ్డ కొందరు అధికారులు ఓడీల పేరుతో చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

బయటి రాష్ట్రాల నుంచి  వచ్చే వాహనాల తనిఖీ

ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల్లో వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వాహనాలను తనిఖీ చేయడం, ఏదైనా అనుమానాస్పద వస్తువులు, అక్రమంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా సరుకులను రాష్ట్రంలోకి తీసుకు వచ్చే వారి పై చెక్​పోస్టుల వద్ద నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రకాల మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌తో వచ్చే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను చెక్​పోస్టుల వద్ద  క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అందులో ఏం తరలిస్తున్నారు? వాటికి సరైన బిల్లులు ఉన్నాయా?  నిషేధ పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా? అని ప్రతి వాహనాన్నీ చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా లోడ్‌‌‌‌‌‌‌‌తో వచ్చే వాహనాలను సీజ్ చేయాలి. కానీ, చాలాకాలంగా ఆయా చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న కొందరు  సిబ్బంది ముడుపులు తీసుకొని తూతూ మంత్రంగానే తనిఖీలు చేసి వాహనాలను అనుమతిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

లక్షల్లోనే అక్రమార్జన!

చెక్​పోస్టుల వద్ద విధులు నిర్వహించే అధికారులు, కొందరు సిబ్బంది మిలాఖత్​ అవుతుండటం వల్ల అక్కడ జరిగే బాగోతం బయటకు రావడం లేదు. రోజుకు  ఒక్కో చెక్‌‌‌‌‌‌‌‌పోస్టు వద్ద  సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం దండుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకే  పలువురు ఉద్యోగులు ఆయా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను వదిలిపెట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది.

 ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న ఓడీలను రద్దు చేయడంతో ప్రస్తుతం మరోసారి ఆయా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద ఓడీల పేరుతో డ్యూటీలు చేయడానికి పలువురు ఎంవీఐలతో పాటు కానిస్టేబుళ్లు ఉత్సాహం చూపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల్లో ఒక్కో చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుకు ఒక్కో రేట్​ కూడా పలుకుతున్నట్టు ఆర్టీఏలో ప్రచారం జరుగుతు న్నది. తాము కోరుకున్న విధంగా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద ఓడీ కింద పనిచేయడానికి తమకు డ్యూటీ వేయిస్తే ఉన్నతాధికారులు లక్షల్లోనే ముట్టచె ప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.