హంగామా పాలిటిక్స్ కాదు.. వాస్తవ రాజకీయాలు కావాలి

హంగామా పాలిటిక్స్ కాదు.. వాస్తవ రాజకీయాలు కావాలి
  • ప్రతి భారతీయుడి అభివృద్ధికి తోడ్పడే ఎకానమీ కావాలి: రాహుల్​ గాంధీ
  • బిహార్ సర్కారుకు నిరుద్యోగం, వలసలే గుర్తింపని విమర్శలు 

న్యూఢిల్లీ:  దేశానికి కావాల్సింది హంగామా రాజకీయాలు కాదని, జీవిత వాస్తవాలతో కూడిన రాజకీయాలు కావాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. టూ వీలర్స్, కార్ల విక్రయాలలో క్షీణత, మొబైల్ మార్కెట్ పతనాన్ని ఉదహరిస్తూ గురువారం ఆయన ఎక్స్​వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 

దేశం అందరి కోసం పనిచేసే ఆర్థిక వ్యవస్థను కోరుకుంటోందని, కేవలం కొద్దిమంది పెట్టుబడిదారుల కోసం కాదని చెప్పారు. సరైన ప్రశ్నలు అడిగే, పరిస్థితిని అర్థం చేసుకునే, బాధ్యతాయుతంగా స్పందించే రాజకీయాలు కావాలన్నారు. "గణాంకాలు నిజం చెబుతాయి. గత సంవత్సరంలో ద్విచక్ర వాహనాల విక్రయాలు 17 శాతం, కార్ల విక్రయాలు 8.6 శాతం తగ్గాయి. 

మొబైల్ మార్కెట్ 7 శాతం క్షీణించింది. మరోవైపు ఖర్చులు, అప్పులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇంటి అద్దె, దేశీయ ద్రవ్యోల్బణం, విద్యా ఖర్చులు, దాదాపు ప్రతిదీ ఖరీదైనదిగా మారుతోంది" అని రాహుల్ పోస్ట్ చేశారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, ప్రతి సామాన్య భారతీయుడు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి అని ఆయన తెలిపారు. 

నితీశ్​ సర్కారు నేరాలకు గుర్తింపుగా మారింది

బిహార్ లోని​సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. గయాలో అత్యాచార బాధితురాలి తల్లికి ట్రీట్​మెంట్​చేసిన డాక్టర్ జితేంద్ర యాదవ్‌‌‌‌ పై దాడిచేసిన ఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్​వేదికగా నితీశ్​సర్కారుపై విమర్శలు గుప్పించారు. నేరాలు, నిరుద్యోగం, వలసలు బిహార్ పాలకపక్షం నిజమైన గుర్తింపుగా మారాయని, ప్రజలను నిస్సహాయంగా చేసి అధికారాన్ని కాపాడుకోవడమే వారి ఎజెండాగా మారిందన్నారు. జేడీయూ, బీజేపీ ప్రభుత్వం న్యాయమైన రాజకీయాలకు కాకుండా పవర్​ పాలిటిక్స్​కు ప్రతీకగా మారిందని ఆయన మండిపడ్డారు.