ఇండియా కూటమి గెలుపు చారిత్రక అవసరం: వర్రె వెంకటేశ్వర్లు

ఇండియా కూటమి గెలుపు చారిత్రక అవసరం: వర్రె వెంకటేశ్వర్లు

ఖైరతాబాద్, వెలుగు:  కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సమాచార హక్కు చట్టం సాధ్యమైందని సమాచార హక్కు చట్టం ఉమ్మడి ఏపీ మాజీ కమిషనర్‌ వర్రె వెంకటేశ్వర్లు చెప్పారు. భారతదేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగం మరువలేనిదన్నారు. సమాచార హక్కు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ‘సమాచార హక్కు చట్టం అమలవుతున్నతీరు – ఎదురవుతున్న సవాళ్లు – పరిష్కార మార్గాలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గాదెపాక మధుకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. లోక్​సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు చారిత్రాత్మక అవసరమన్నారు. ఆర్టీఐ కార్యకర్తలు, విద్యావంతులు, మేధావులు ఏకమై కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ విజన్ ను ముందుకు తీసుకెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉందన్నారు. సీఎం రేవంత్​నాయకత్వంలో ఎక్కువ లోక్​సభ సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో కమిషన్​సభ్యులను నియమించి, ఆర్టీఐ కేసుల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్​చొరవ చూపాలని కోరారు. సదస్సులో ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్.వి.వి.రావు, ఉభయ రాష్ట్రాల మాజీ చీఫ్​ఇంజనీర్​ఎమ్ఏ కరీమ్, ఆర్టీఐ కార్యకర్తలు పిట్టల యాదయ్య, పెరక అభిలాష్, నజీర్, లుక్మాన్, వంగాల మల్లేశ్, చోడే మహేందర్​తదితరులు పాల్గొన్నారు.