Sanjeep Xess : పూరి గుడిసెలో హాకీ స్టార్

Sanjeep Xess : పూరి గుడిసెలో హాకీ స్టార్

పుట్టింది మారుమూల గ్రామం. పెరిగింది పేద కుటుంబం. పూట గడవడమే గగనం. కానీ  ఆటపై ఉన్న ఆసక్తి.. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న పట్టుదల ముందు.. అతని సమస్యలు చిన్నబోయాయి. లక్ష్య సాధన కోసం కష్టపడి కోరుకున్న గమ్యానికి చేరుకున్నాడు. పల్లెటూరి నుంచి ప్రపంచ వేదికకు చేరుకున్నాడు. ఒడిశాలో జరిగనున్న హాకీ వరల్డ్ కప్ లో భారత జట్టుకు ఆడబోతున్నాడు నీలం సంజీప్ జెస్. 

పూరిగుడిసెలో పుట్టి..

గిరిజన హాకీ స్టార్ నీలం సంజీప్ జెస్.. ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లా కడబహల్ గ్రామంలో జన్మించాడు. తండ్రి బిపిన్, తల్లి జిరా... ఇద్దరు రోజువారీ కూలీలు. సంజీప్ కు ఒక సోదరుడు,ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. ఆ గుడిసెను కూడా 40 ఏళ్ల క్రితం గ్రామస్థుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బుతో కట్టుకున్నారు.

వెదురు కర్రలు, చిరిగిన బట్టలతో ప్రాక్టీస్..

సుందర్ ఘడ్ జిల్లా అనేక మంది ప్రతిభావంతులైన హాకీ క్రీడాకారులను దేశానికి అందించింది. ఈ జిల్లా నుంచి ఎంతో మంది హాకీ ప్లేయర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు.  దీంతో నీలం సంజీప్ కు సైతం హాకీపై ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుంచి హాకీ ప్రాక్టీస్ చేసేవాడు. అన్నతో పాటు..కొంత మంది స్నేహితులతో కలిసి హాకీ ఆడేవాడు. అయితే హాకీ స్టిక్స్, బంతి కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ సమయంలో వెదురు కర్రలు, చిరిగిన బట్టలతో తయారు చేసుకున్న బంతులతో హాకీ ఆడేవారు. హాకీపై ఉన్న ఆసక్తితో నీలం సంజీప్.. జిల్లా , రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపికై అనేక టోర్నీల్లో సత్తా చాటాడు. 

కీలక టోర్నీల్లో సత్తా..

గౌహతి, షిల్లాంగ్‌లలో జరిగిన 12వ దక్షిణాసియా క్రీడల్లో రజత పతక విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో నీలం సంజీప్ ఒకడు. అదే ఏడాది నాల్గవ U-18 ఆసియా కప్ లో టీమిండియాను గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. బెల్జియంలో జరిగిన ఐదు దేశాల U-23 పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత యువ జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. కాంస్య పతకాన్ని సాధించాడు. ఇప్పుడు ఏకంగా ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున ఆడబోతున్నాడు. 

గ్రామస్తుల ఎదురుచూపులు..

2023 జనవరి 13 నుండి 29 వరకు భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో హాకీ వరల్డ్ కప్ జరగనుంది. దీంతో నీలం సంజీప్ ఆటను చూసేందుకు అతని గ్రామస్తులు ఆతృతగా ఎదురుచూస్తున్నారని కడబహల్ సర్పంచ్ లూసియా మమతా కిండో తెలిపారు. తమ ఊరి పిల్లలకు చిన్నప్పటి నుంచి హాకీ అంటే చాలా ఇష్టమని...అయితే సంజీప్.. జిల్లా, రాష్ట్రం, దేశం కోసం ఆడి ఈ స్థాయికి ఎదుగుతాడని తాము ఊహించలేదంటున్నాడు. పేదరికం అడ్డుగా ఉన్నా కష్టపడి అనుకున్నది సాధించాడం సంతోషంగా ఉందని అన్నారు. హాకీ వరల్డ్ కప్ లో సంజీప్ అద్భుతంగా రాణిస్తాడని అతని సొదరి అశ్రిత క్సెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. చిన్నప్పటి నుంచి సంజీప్..ఆటే ప్రాణంగా జీవించాడని..అందుకే అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని చెప్పుకొచ్చింది. పురుషుల హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని తాము ఆశిస్తునట్లు చెప్పింది.