వేపనే ఉత్తమ చెట్టు..!   

వేపనే ఉత్తమ చెట్టు..!   

ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని పొలంలో మామిడి, వేప మొక్కలు పక్కపక్కనే  మొలిచాయి. వాటిని గమనించిన అతను మామిడి చెట్టుకు పాదు చేసి, ఎరువు వేసి నీళ్లు పెట్టి, దాని బాగోగులు చూసుకునేవాడు. వేప చెట్టును పట్టించుకునే వాడు కాదు. తాను గొప్పదాన్ని కాబట్టి, రైతు తన పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు అనుకునేది మామిడి. దాంతో అహంకారం కూడా పెరిగింది. కొద్దిరోజులయ్యాక.. ఆ రెండు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. కాయలు  కాశాయి. ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను తింటుండటంతో మామిడి చెట్టుకి గర్వం పెరిగి, పక్కనే ఉన్న వేప చెట్టుతో మాట్లాడటం మానేసింది. అది గమనించిన వేప చెట్టు ‘‘ఈ మధ్య నాతో మాట్లాడడం లేదు. ఎందుకు?’’ అని మామిడి చెట్టుని అడిగింది.

‘‘నాకు, నీకు పోలిక ఏంటి? మధురమైన పండ్లను ఇచ్చే చెట్టుని నేను. నీ పండ్లను  జనం కనీసం వాసన కూడా చూడరు. నువ్వు నా కంటే తక్కువ దానివి. నీతో నాకు పనేంటి?” అంది గర్వంగా. ‘‘పండ్లు తియ్యగా ఉన్నంత మాత్రాన గొప్పదానివా? నా విత్తనాలకు కూడా గిరాకీ ఉంది. అయినా నీలాంటి అహంకారితో స్నేహం అవసరం లేదులే” అంది వేప. అలా మామిడి, వేప రోజూ కొట్టుకునేవి. అదంతా ఆ రెండు చెట్ల దగ్గర్లో ఉన్న కొబ్బరి చెట్టు వింటుండేది. ఒకరోజు వాటి మాటలకు చిర్రెత్తిపోయి, ‘‘మీ గొడవ ఆపండి. నేను వినలేక పోతున్నా” అంది. ‘‘అదేంటి అలా విసుక్కుంటావు. మా ఇద్దరిలో ‘‘ఉత్తమ చెట్టు’’ ఎవరో తేల్చుకోలేకపోతున్నాం. పోనీ, కనీసం నువ్వైనా చెప్పు ‘మాలో ఎవరు గొప్పో. గొడవ తీరి, మానాన మేం బతుకుతాం’’ అని మామిడి, వేప అన్నాయి.

‘‘పిచ్చి మొఖాల్లారా... ఒకరు గొప్పేంటి? ఒకరు తక్కువేంటి? మన చెట్లు దేనికవే గొప్పవి. మనలో ఏదో ఒక భాగం మనుషులకు ఉపయోగపడుతుంటుంది. మీ వాదులాట మానుకోండి’’ అని మెత్తగా మందలించింది కొబ్బరి. అయినా ‘‘మాలో ఉత్తమ చెట్టు ఎవరో తేల్చి చెప్పమ’’ని నిలదీసింది మామిడి. ‘‘చెప్పాక బాధపడొద్దు సుమా!’’ అంది కొబ్బరి. అలాగే... అని తలలు ఊపాయి మామిడి, వేప చెట్లు. ‘‘నా దృష్టిలో వేప ఉత్తమ చెట్టు’’ అంది కొబ్బరి. ‘అదెలా?’ అంది కోపంగా మామిడి. ‘‘తియ్యటి మామిడి పండ్లు తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ వేప పండ్లు చేదుగా ఉన్నప్పటికీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా వేపాకు, చెక్క, కలప... అంతెందకు వేప చెట్టు గాలితో సహా.... ప్రతి ఒక్కటి ప్రాణ రక్షణకు దోహదపడతాయి. అందుకే వేపను ‘‘ఉత్తమ చెట్టు’’గా నిర్ణయించా. ఇక మీ ఇష్టం’’ అంది కొబ్బరి.

‘అదేం లేదు... నీకు నేనంటే అసూయ. అందుకే అలా అంటున్నావు’ అన్నది కోపంగా  మామిడి. కొంతకాలం తరువాత మామిడి చెట్టుకు అంతుపట్టని వేరు పురుగు తెగుళ్లు, చీడ పీడలు సోకాయి. దాంతో ఆకులు, కాయలు రాలిపోయాయి. కొమ్మలు ఎండి పోయాయి. పరిస్థితి గమనించిన రైతు వేప చెట్టు కింద ఉన్న వేపకాయలను దంచి, ఆ పిండిని మామిడి చెట్టు మొదట్లో మట్టి తవ్వి అందులో వేశాడు. రెండు మూడు రోజుల్లోనే మామిడి చెట్టుకు పట్టిన పురుగు పోయింది. అప్పుడు మామిడి చెట్టుకి కనువిప్పు కలిగింది. కొబ్బరి చెట్టు చెప్పినట్లు ‘‘ఆరోగ్యం ఇవ్వడం గొప్ప’’ అన్న విషయం తెలుసుకుని వేపనే ఉత్తమ చెట్టుగా ఒప్పుకుంది. ఇక అప్పటినుండి వేప చెట్టుతో మామిడి చెట్టు బలంగా స్నేహం చేసింది.
- కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి