వేపచెట్లకు ఆపదొచ్చింది.. కాపాడతం

V6 Velugu Posted on Nov 25, 2021

  • త్వరలోనే కొత్త మందు.. వేపచెట్లను కొట్టేయద్దు
  • ప్రజలకు సైంటిస్టుల సూచన    
  • డైబ్యాక్​ డిసీజ్​తో రాష్ట్రమంతా ఎండుతున్న చెట్లు
  • పట్టించుకోని సర్కారు
  • మూడు వేల చెట్లపై ప్రొఫెసర్​ సదాశివయ్య రీసెర్చ్​
  • త్వరలో కొత్త మందు కనుక్కుంటామని వెల్లడి

వనపర్తి, వెలుగు: డైబ్యాక్​డిసీజ్​తో తెలంగాణ అంతటా వేప చెట్లు ఎండిపోతున్నాయి. ఇందుకు కారణమైన బ్యాక్టీరియాను నివారించేందుకు ‘బాబిస్టిన్’ అనే పెస్టిసైడ్ పిచికారీ చేయాలని సైంటిస్టులు మొదట్లో సూచించారు.  కానీ ఈ మందుకు కూడా బ్యాక్టీరియా లొంగకపోవడంతో చాలాచోట్ల వేపచెట్లను కొట్టేస్తున్నారు. ఇలా చెట్లను నరుకుతూ పోతే వేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రాష్ట్ర సర్కారు  పట్టించుకోవడం లేదు. దీంతో మహబూబ్​నగర్​జిల్లా జడ్చర్ల గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ బాటనీ ప్రొఫెసర్​డాక్టర్​సదాశివయ్య స్వయంగా రంగంలోకి దిగారు. కొద్ది నెలలుగా 3 వేల చెట్లపై ప్రయోగాలు చేసిన ఆయన.. డైబ్యాక్​ డిసీజ్​కు త్వరలోనే కొత్తమందు కనుక్కుంటామని, ఈలోగా తొందరపడి ఎండిపోతున్న వేప చెట్లను కొట్టేయొద్దని సూచిస్తున్నారు.

ఆపదలు తీర్చే వేపకే ఆపద 
దేశప్రజలకు వేపచెట్టుతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలామంది దినచర్య పొద్దున వేపపుల్లతో పండ్లు తోముకోవడంతోనే  మొదలవుతుంది. యాంటీ బ్యాక్టీరియల్​, యాంటీ ఫంగస్ లక్షణాలు గల వేపను భారతీయులు.. పండుగలు, పబ్బాల్లో, వివిధ పూజా కార్యక్రమాల్లో విరివిగా వాడుతారు. అమ్మతల్లి లాంటి వ్యాధులు సోకినప్పుడు మంచం మీద వేపకొమ్మలు పెట్టడం, వ్యాధులు దరిచేరకుండా గుమ్మాలకు కట్టడం తరతరాలుగా వస్తోంది. ఇండ్లలో దోమలను తరిమేందుకు  కూడా వేపాకుతో పొగవేయడం చూస్తుంటాం. ఇక ఆయుర్వేదంలో వేపాకు, పూత, బెరడుకు ఎంతో ప్రాధాన్యముంది. చాలా ఔషధాల్లో, ముఖ్యంగా డయాబెటిస్​ నివారణలో వేపను వినియోగిస్తారు. పంట పొలాలను ఆశించే చీడపీడల మీద వేపను జీవాయుధంగా ప్రయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ దేశాలతో పోరాడి మరీ మన ప్రభుత్వం వేప ఉత్పత్తులపై  పేటెంట్​సంపాదించింది. అంతటి ఔషధ గుణాలున్న వేపకే ఇప్పుడు ఆపద వచ్చింది. వేపచెట్లు కొంతకాలంగా ఒక్కొక్కటే ఎండిపోతున్నాయి. మొదట చెట్టు కొనలు కాలిపోయినట్టు మారి క్రమంగా మోడువారుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది వేప చెట్లను కొట్టేస్తున్నారు. దీనిపై అక్టోబర్​22న వెలుగులో ‘వేప చెట్టుకు కష్టకాలం’ అనే హెడ్​లైన్​తో స్టోరీ ప్రచురించింది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సోషల్​మీడియా వేదికగా చర్చ జరిగింది. హరితహారం కింద కోట్లు పెట్టి కొత్తగా మొక్కలు నాటుతున్న ప్రభుత్వం.. ఎండిపోతున్న వేపచెట్లను ఎందుకు కాపాడడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

కొత్త మందు దిశగా ప్రయోగాలు
చాలాకాలంగా వేపచెట్లు ఎండిపోతున్నా ప్రభుత్వంగానీ.. ఫారెస్ట్​, అగ్రికల్చర్ ఆఫీసర్లుగానీ పట్టించుకోవడం లేదు.  దీంతో పర్యావరణవేత్తలు, సైంటిస్టులు వేపను కాపాడుకునే దిశగా చొరవ చూపుతున్నారు. వేపచెట్లను ఆశిస్తున్న బ్యాక్టీరియా మీద పరిశోధనలు ప్రారంభించారు. చెట్లను కొట్టేయొద్దని, కాలబెట్టొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. జడ్చర్ల గవర్నమెంట్​డిగ్రీ కాలేజీ బాటనీ ప్రొఫెసర్​డాక్టర్​ సదాశివయ్య, తన టీమ్​తో కలిసి ఇప్పటికే మూడు వేలకు పైగా ఎండిపోయిన వేపచెట్లను పరిశీలించారు. వాటిపై బాబిస్టిన్​మందును పిచికారీ చేసి ఫలితాలను విశ్లేషించారు. కానీ ఈ మందు అంతగా ప్రభావం చూపలేదని  సదాశివయ్య చెబుతున్నారు. అందుకే కొత్తమందు కనుక్కునేందుకు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామంటున్నారు. ఇందుకు  మైక్రో కెమికల్​ ల్యాబ్​ అవసరమని చెప్తున్నారు. ప్రస్తుతానికి జడ్చర్ల కాలేజీ ల్యాబ్​లో  రీసెర్చ్​ చేస్తున్నామని, తమ ప్రయోగాలు సక్సెస్​ అయితే 20 రోజుల్లో కొత్త మందు కనుగొంటామని చెబుతున్నారు.

ఎండిపోతున్నా పట్టించుకుంటలేరు
మా ఇంటి ముంగట రెండు పెద్ద యాప చెట్లుండే. ప్రతీ ఎండా కాలం మస్తు యాప కాయలు పట్టేటివి. రాలిన కాయల్ని అరుగు మీద ఆరబోసి వారానికోసారి కిరాణా షాపుల అమ్ముతుంటిమి. పచ్చి కాయలకు రూ.5, ఎండిన  వాటికి రూ.12 ఇస్తుండ్రి. అట్ల రూ. 100 వరకు డబ్బులొస్తుండే. నిరుడు ఎండాకాలం కాయలు తక్కువ పట్టినయి. రెండు నెలల సంది ఆకులు మాడిపోయినయి.  తెగులొచ్చిందని మా ఆయన చెట్లను తీసేసిండు.
- భ్యాగరి పుష్పలత, యన్మన్​గండ్ల, నవాబ్​పేట మండలం

ఇంకెక్కడి యాప చెట్లు
యాప చెట్లు ఇంకేడున్నయి బిడ్డా! అన్ని సస్తాన్నయి. పిల్లలకు తట్టుపోసినా యాప పసురు పుస్తే పుండ్లు తగ్గేటియి. బియ్యానికి పురుగు పట్టకుండా సంచుల్లో యాపాకు పెడుతుంటి. పండ్లు తోమన్నింకే యాప పుల్లనే  వాడుతుంటిమి. ఇప్పుడు చూద్దమన్నా చెట్లు కనిపిస్తలేవు. చెట్లకు అదేదో రోగం పట్టుకుందంట. ఊర్ల ఉన్న చెట్లన్నీ సస్తన్నయి. 
- కొనిటి చెన్నమ్మ, యన్మన్​గండ్ల, నవాబ్​పేట మండలం

Tagged Telangana, Neem trees, die back disease, Professor sadashivaiah

Latest Videos

Subscribe Now

More News