
హాజో (పోలెండ్): దోహా డైమండ్ లీగ్‌లో తన కెరీర్‌లో తొలిసారి 90 మీటర్ల మార్కును అందుకున్న ఇండియా జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అదే జోరును కొనసాగించలేకపోయాడు. ఓర్లెన్ అథ్లెటిక్స్ మీట్‌లో ఆ మార్కుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఈవెంట్‌లో చోప్రా 84.14 మీటర్లతో రెండో స్థానంతో సంతృప్తి చెందాడు. ఫౌల్‌తో ఆట ప్రారంభించిన నీరజ్ రెండో ప్రయత్నంలో 81.25 మీటర్లతో సరిపెట్టాడు.
3,4వ ప్రయత్నాల్లో ఫౌల్స్ చేసిన అతను ఐదోసారి జావెలిన్‌ను 81.80 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అయితే, చివరిసారి 84.14 మీటర్లు విసిరి రెండో ప్లేస్‌కు వచ్చాడు. దోహా డైమండ్ లీగ్‌లో టాప్ ప్లేస్ సాధించిన జర్మనీ అథ్లెట్ జులియన్ వెబర్ 86.12 మీటర్లతో మళ్లీ అగ్రస్థానం అందుకున్నాడు. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 83.24 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు.