
యుగెనా:
ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. శనివారం అర్ధరాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్లో నీరజ్ ఈటెను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో ప్లేస్‌కే పరిమితమయ్యాడు. చెక్ రిపబ్లిక్ త్రోయర్ జాకూబ్ వాడ్లెచ్ 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా నిలిచాడు. ఒలివర్ హలాండర్ (ఫిన్లాండ్) 83.74 మీటర్ల దూరంతో మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. వాడ్లెచ్‌కు ట్రోఫీతో పాటు రూ. 26 లక్షల 58 వేలు, నీరజ్‌కు రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. హోరాహోరీగా సాగిన పోటీల్లో నీరజ్ తొలి ప్రయత్నం ఫౌల్ అయ్యింది. రెండో ప్రయత్నంలో 83.80 మీటర్ల దూరాన్ని అందుకున్నాడు. తర్వాతి ప్రయత్నాల్లో వరుసగా 81.37 మీటర్లు, ఫౌల్, 80.74 మీటర్లు, 80.90 మీటర్లు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో 85 మీటర్ల కంటే తక్కువ దూరం విసరడం చోప్రాకు ఇదే ఫస్ట్ టైమ్. దీంతో 13 అంచెలుగా సాగిన డైమండ్ లీగ్ ట్రోఫీని అందుకోవడంలో ఇండియన్ స్టార్ త్రోయర్ ఫెయిలయ్యాడు. 25 డిగ్రీల టెంపరేచర్, 45 శాతం తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నీరజ్ పెర్ఫామెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపెట్టాయి. దీంతో పాటు పక్కనే ఇతర ఈవెంట్స్ కూడా జరగడంతో విండ్ స్పీడ్‌లో చాలా తేడాలు కనిపించాయి. దీన్ని అంచనా వేయలేకపోయిన నీరజ్ ఈటెను సరైన దిశలో విసరలేదు.