ఒస్ట్రావా గోల్డెన్‌‌ స్పైక్‌‌ టోర్నీలో నీరజ్‌‌కు గోల్డ్‌‌

ఒస్ట్రావా గోల్డెన్‌‌ స్పైక్‌‌ టోర్నీలో నీరజ్‌‌కు గోల్డ్‌‌

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా.. ఒస్ట్రావా గోల్డెన్‌‌ స్పైక్‌‌ టోర్నీలో స్వర్ణంతో  మెరిశాడు. మంగళవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో నీరజ్‌‌ ఈటెను 85.29 మీటర్ల దూరం విసిరి టాప్‌‌ ప్లేస్‌‌లో నిలిచాడు. ఇంజ్యురీ కారణంగా గత రెండు ఎడిషన్లకు దూరంగా ఉన్న నీరజ్‌‌ ఈసారి మాత్రం సత్తా చాటాడు. తొలి, ఆరో ప్రయత్నంలో ఫౌల్‌‌ అయిన ఇండియన్‌‌ ప్లేయర్‌‌ రెండో అటెంప్ట్‌‌లో 83.45 మీటర్ల దూరం అందుకున్నాడు.

కానీ మూడో ప్రయత్నంలో ఏకంగా 85.29 మీటర్ల దూరం విసిరి లీడ్‌‌లోకి వచ్చాడు. తర్వాతి రెండు ప్రయత్నాల్లో 82.17 మీ, 81.01 మీటర్లకే పరిమితమయ్యాడు. సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్‌‌ 84.12 మీటర్ల దూరంతో సిల్వర్‌‌ మెడల్‌‌ నెగ్గాడు. ఇది అతని పర్సనల్ బెస్ట్ కావడం విశేషం. గ్రెనెడా స్టార్‌‌ అండర్సన్‌‌ పీటర్స్‌‌ 83.63 మీటర్ల దూరంతో బ్రాంజ్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకున్నాడు. 

ఈ సీజన్‌‌లో 27 ఏళ్ల చోప్రాకు ఇది మూడో విజయం కాగా, వరుసగా 24వ టోర్నీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రికార్డును కంటిన్యూ చేశాడు. ఈ నెల ఆరంభంలో పారిస్‌‌ డైమండ్‌‌ లీగ్‌‌లో స్వర్ణం నెగ్గిన చోప్రా.. ప్రస్తుతం సూపర్‌‌ ఫామ్‌‌లో కనిపిస్తున్నాడు. అయితే దోహాలో 90 మీటర్ల మార్క్‌‌ను అందుకున్న చోప్రా దాన్ని రిపీట్‌‌ చేయలేకపోయాడు. వచ్చే నెల 5న బెంగళూరులో జరిగే క్లాసిక్​ఈవెంట్‌‌లో నీరజ్‌‌ బరిలోకి దిగనున్నాడు.