- రాత్రనకా, పగలనకా చదివిన విద్యార్థులకు దక్కింది పేపర్ లీక్‌లే
- మోదీ అమృత్ కాల్.. దేశానికి విషయుగంగా మారిందని మండిపాటు
న్యూఢిల్లీ: పేపర్ లీక్‌తో లక్షలాది మంది విద్యార్థుల కలలను చిదిమేశారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. నీట్ పరీక్ష రద్దు కావడంపై మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. పరీక్షను రద్దు చేయడాన్ని యువత భవిష్యత్తుపై జరిగిన పెద్ద నేరంగా అభివర్ణించారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో 22 లక్షల మందికి పైగా విద్యార్థుల కష్టార్జితం, కలలు మంటగలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నీట్ పరీక్ష రద్దయింది. విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు, కలలు ఛిన్నాభిన్నమయ్యాయి. బిడ్డల చదువు కోసం తండ్రులు అప్పులు చేశారు.. తల్లులు నగలు అమ్ముకున్నారు. లక్షలాది మంది పిల్లలు రాత్రనక, పగలనక కష్టపడి చదివారు.
కానీ వారికి బదులుగా లభించింది పేపర్ లీక్‌లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యవస్థీకృత అవినీతి మాత్రమే’’ అని మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో మాఫియా రాజ్యమేలుతోందని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రతిసారీ పేపర్ మాఫియా క్షేమంగా తప్పించుకుంటోందని, కానీ శిక్ష మాత్రం నిజాయితీగా చదివే విద్యార్థులే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
