
- రాత్రంతా బట్టీపట్టి మరుసటి రోజు ఎగ్జామ్‌కు..
- బిహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు
- ఒక్కో పేపర్‌కు రూ.40 లక్షల వరకు వసూలు
- 13 మంది అరెస్ట్.. ప్రధాన సూత్రధారిగా అమిత్ ఆనంద్
పాట్నా: నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది నిజమే అని బిహార్ పోలీసుల విచారణలో తేలింది. ఎగ్జామ్‌కు ముందు రోజు రాత్రే తమకు ప్రశ్నపత్రంతో పాటు జవాబులు కూడా అందాయని పోలీసుల అదుపులో ఉన్న కొందరు స్టూడెంట్స్ అంగీకరించారు. ఆ రోజు రాత్రంతా ఆన్సర్లు బట్టీపట్టి.. తర్వాత రోజు ఎగ్జాంకు వెళ్లామని చెప్పారు. తమకు ముందురోజు రాత్రి ఇచ్చిన క్వశ్చన్ పేపర్.. ఎగ్జామ్ రోజు వచ్చిన పేపర్ ఒకటే అని బిహార్‌కు చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ (22) పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ మేరకు తన స్టేట్మెంట్ రాసిచ్చాడు. నీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటిదాకా 13 మందిని అరెస్ట్ చేశామని బిహార్ పోలీసులు తెలిపారు. అనురాగ్ యాదవ్ మామయ్య సికందర్ తో పాటు నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో సికిందర్.. జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగా, పేపర్ ఎలా బయటికొచ్చిందన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నీట్ కేసు వ్యవహారంలో అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు.
నలుగురి కోసం పేపర్ కొన్న: సికందర్
నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ నుంచి నీట్ ఎగ్జామ్ పేపర్ కొన్నట్టు పోలీసులకు సికందర్ చెప్పాడు. ‘‘నేను దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో జూనియర్ ఇంజినీర్ పని చేస్తున్నాను. నితీశ్, అమిత్ ఆనంద్ నాకు పరిచయం. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీక్ చేయొచ్చని వారిద్దరు చెప్పారు. నీట్ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఒక్కో అభ్యర్థికి రూ.30 నుంచి 32లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు. డబ్బులు ఇస్తానని నేను ఒప్పుకున్నాను. నలుగురు అభ్యర్థులు ఉన్నారని చెప్పి రూ.30లక్షలకు బేరం కుదుర్చుకున్న. జూన్ 4న రాత్రి నలుగురిని నితీశ్, ఆనంద్ వద్దకు తీసుకెళ్లిన. వాళ్లు క్వశ్చన్ పేపర్, ఆన్సర్లు ఇచ్చారు. రాత్రంతా బట్టీపట్టి మరుసటి రోజు ఎగ్జామ్ రాశారు. డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.30లక్షలకు బదులు.. రూ.40లక్షలు వసూలు చేశా’’అని సికందర్ పోలీసులకు చెప్పాడు. ఎగ్జామ్ తర్వాత వెహికల్ చెకింగ్టైమ్లో స్టూడెంట్ అడ్మిట్ కార్డులతో పోలీసులకు దొరికిపోయినట్టు తెలిపాడు.
లీక్ వెనుక తేజస్వీ యాదవ్ హస్తం: బీజేపీ
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ హస్తం ఉందని బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ‘‘తేజస్వీ యాదవ్ హెల్పర్ ప్రీతమ్ కుమార్.. బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఎంప్లాయ్కు ఫోన్ చేసి.. సికందర్ కోసం గవర్నమెంట్ బంగ్లాలో రూమ్ బుక్ చేయాలని చెప్పాడు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సికందర్ ప్రధాన నిందితుడు. దీంతోనే అర్థం అవుతున్నది పేపర్ ఎవరు లీక్ చేయించారో..’’అని సిన్హా అన్నారు.
స్టూడెంట్ల జీవితాలు నాశనం: ప్రతిపక్షాలు
బీజేపీ విమర్శలను ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీపార్టీ నేతలు తిప్పికొట్టారు. దేశంలో ఎగ్జామినేషన్ ప్రాసెస్ కుప్పకూలిందన్నారు. ఈ పరిస్థితికి బీజేపీయే కారణమని ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదని మండిపడ్డారు. స్టూడెంట్స్ ఫ్యూచర్‌ను బీజేపీ నేతలు నాశనం చేశారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే అన్నారు. ఎన్డీఏ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతున్నదన్నారు. యూజీసీ నెట్‌ను కూడా రద్దు చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయాలని ఎన్సీపీ లీడర్ సుప్రియ కోరారు.