నీట్ సక్సెస్ స్టోరీ.. 8ఏళ్లకే పెళ్లి.. ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సత్తా

నీట్ సక్సెస్ స్టోరీ.. 8ఏళ్లకే పెళ్లి.. ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో సత్తా

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NEET)ను ఛేదించాలంటే మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యంత కష్టతరమైన పోటీ పరీక్షలలో ఇదీ ఒకటి. అయితే రూపా యాదవ్ అనే అమ్మాయి ప్రతికూల పేదరికం, అనేక సామాజిక ఒత్తిళ్లతో పోరాడుతున్నప్పటికీ, ఈ పరీక్షలో ఆకట్టుకునే ప్రతిభ కనబర్చి, విజయం సాధించింది.

రూపా యాదవ్‌కు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ కుటుంబ పరిస్థితుల రిత్యా ఆమె చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఆమెకు కేవలం ఎనిమిదేళ్ల వయస్సులోనే వివాహం చేశారు. రాజస్థాన్‌కు చెందిన రూపా తన ఎనిమిదేళ్ల వయసులో తన ఇంటిని వదిలి తన భర్త కుటుంబంతో నివసించాల్సి వచ్చింది. వివాహ సమయానికి, ఆమె భర్త వయస్సు కేవలం 12మాత్రమే. రూపా తన పాఠశాల విద్యను పూర్తి చేస్తూనే ఇంటి పనులను, అత్తమామలను చూసుకునేది.

Also Read : శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో రామాయ‌ణ్ న‌టుడు

అయితే రూపాకు చదువుపట్ల ఉన్న అంకితభావాన్ని చూసిన ఆమె భర్త, బావమరిది ఆమెకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఆమె చదువుకు నిధులు సమకూర్చడానికి, పుస్తకాలు కొనడానికి ఆమె భర్త డబ్బు సంపాదించడానికి పలు రకాలుగా ప్రయత్నించేవాడు. అదనపు ఆదాయం కోసం ఆటో రిక్షా నడపడం కూడా చేశాడు. అలా కష్టపడి సంపాదించిన డబ్బుతో రూపాను ఆమె భర్త మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం పంపాడు.

అలా రూపా నీట్ 2017 పరీక్షకు హాజరై.. వైద్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబానికి మొదటి డాక్టర్‌గా అవతరించింది. ఆమె నీట్ 2017 పరీక్షలో 720 మార్కులకు 603 మార్కులు సాధించింది. ఆల్ ఇండియా ర్యాంక్ లో (AIR) ఆమె 2వేల 612 ర్యాంక్ ను సాధించింది.