శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో రామాయ‌ణ్ న‌టుడు

 శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో రామాయ‌ణ్ న‌టుడు

మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీచేసే 144 మంది అభ్య‌ర్ధుల‌తో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ ఆదివారం (అక్టోబర్​ 15న) విడుద‌ల చేసింది. ముఖ్యమంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌పై విక్ర‌మ్ మ‌స్త‌ల్‌ను కాంగ్రెస్ బ‌రిలో దింపింది. ఈయన ఎవరో కాదు.. 2008 రామాయ‌ణ్‌లో హ‌నుమాన్ పాత్ర‌ధారే విక్ర‌మ్ మ‌స్త‌ల్‌. బుధ్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వీరిద్ద‌రూ త‌ల‌ప‌డ‌నున్నారు.

ఈ ఏడాది జులైలో విక్ర‌మ్ మ‌స్త‌ల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. క‌మ‌ల్ నాథ్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక బీజేపీ ఇటీవ‌ల విడుద‌ల చేసిన నాలుగో జాబితాలో చౌహాన్ బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని చెప్పింది. బుధ్ని నియోజ‌క‌వ‌ర్గం చౌహాన్‌కు కంచుకోట‌గా పేరొందింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చౌహాన్ ఈ సీటు నుంచి ఏకంగా 58 వేల 999 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 

Also Read : ఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్

కాంగ్రెస్ జాబితాలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ క‌మ‌ల్‌నాథ్​కు చింద్వారా స్ధానం ద‌క్కింది. మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ కుమారుడు జైవ‌ర్ధ‌న్ సింగ్ రాఘ‌వ‌ఘ‌డ్ స్ధానం నుంచి పోటీ చేయనున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం కొలువుతీరింది. అయితే.. క‌మ‌ల్‌నాథ్​ స‌ర్కార్ కుప్ప‌కూల‌డంతో శివ‌రాజ్ సింగ్ చౌహాన్ సార‌థ్యంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటైంది.ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 17న ఒకే విడ‌త‌లో జరగనున్నాయి. డిసెంబ‌ర్ 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.