నెగెటివిటీని దూరంగా పెట్టాలి

నెగెటివిటీని దూరంగా పెట్టాలి

“నెగెటివ్‌‌ కామెంట్లు చేసేవాళ్లు ముల్లు లాంటివాళ్లు. వాళ్ల స్వభావం తెలియగానే చెప్పుతో తొక్కేయాలి లేదా దూరంగా వెళ్లిపోవాలి” 

ఒక పని చేస్తున్నారంటే.. దాన్ని ప్రోత్సహించే వాళ్లు ఉంటారు, దెప్పిపొడిచే వాళ్లూ ఉంటారు. వందలో తొంభై మంది ఆ పనిని మెచ్చుకుంటే.. కచ్చితంగా పదిమంది నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ చేస్తారు. ఆ పదిమంది మాటలు పట్టుకుని, దాని గురించే ఆలోచిస్తారు. ‘వాళ్లు ఎందుకు అలా మాట్లాడారు? నేనంటే ఏంటో చూపించాలి. నేను చేసేది ఏంటో, ఎందుకు చేస్తున్నానో అర్థమయ్యేలా చెప్పాలి. నా మీద ఉన్న ఒపీనియన్‌‌ను మార్చాలి’ అని అనుకుంటారు. ఆవేశంలో, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని మానసికంగా కుంగిపోతారు. కానీ, అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, వాళ్లను మార్చాలనే ప్రయత్నాలు మానుకోవాలని చెప్తున్నాడు చాణక్యుడు. చుట్టూ ఉండేవాళ్లు ఎలాంటి వాళ్లనే విషయం పసిగట్టి వాళ్లకు దూరంగా ఉండాలనీ అంటున్నాడు.    

జ్యోతికి మోడలింగ్‌‌, యాక్టింగ్‌‌ అంటే చాలా ఇష్టం. దానికి తగ్గట్లుగా తన కెరీర్‌‌‌‌ను ఎంచుకుంది. మోడలింగ్‌‌ చేస్తూ, ఇన్‌‌స్టా రీల్స్‌‌ చేస్తూ ఫాలోయింగ్‌‌ పెంచుకుంది. లక్షల మంది ఫాలోయర్స్‌‌తో దూసుకుపోతోంది. చాలామంది ఆమెకు ఫ్యాన్స్‌‌ అయిపోయారు. అదంతా చూసిన దగ్గరి బంధువు రవి.. ఆమెపై నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ చేశాడు. ‘ నువ్వు ఎందుకు అలా చేస్తావు? నీ డ్రెస్సులు అసలు బాగుండవు. వేలమంది నీ వీడియోలు చూస్తున్నారు ఎంత జాగ్రత్తగా చేయాలి. చూశావా ఎన్ని నెగెటివ్‌ కమెంట్లు వస్తున్నాయో’ లాంటి మాటలతో ఆమెను బాధపెడుతుంటాడు. దాంతో రవికి తనంటే ఏంటో చెప్పాలని చూసిందామె. తనకు వస్తున్న పాజిటివ్‌ కామెంట్లను చూపిస్తూ, ఎంత ఫాలోయింగ్‌ ఉందో, తన ప్యాషన్‌ ఏంటో చెప్పాలనుకుంది. కానీ, అతని కామెంట్స్‌‌ ఎక్కువ అయ్యాయే తప్ప తగ్గలేదు. దాంతో నిజంగానే తను సరిగా చేయడం లేదనే ఫీలింగ్‌లోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి ఇన్‌‌స్టాలో వస్తున్న పాజిటివ్‌‌ కామెంట్స్‌‌ పక్కనపెట్టేసి, ఎవరైనా నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ పెడితే వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మానసికంగా కుంగిపోయింది. తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది జ్యోతిక. 


‘పాము ఒక్కసారి మాత్రమే కాటేసి వెళ్లిపోతుంది.. మన చుట్టూ ఉండే చెడ్డవాళ్లు అడుగడుగునా కాటేస్తారు. అందుకే, చుట్టూ చేరి ఎప్పుడూ, మన గురించి ఏదో ఒకటి మాట్లాడేవారితో జాగ్రత్తగా ఉండాలి.  వాళ్లు ఎలాంటి వారనేది  ముందే తెలుసుకోవాలి. చేసే పనుల్లో చెడు వెతుకుతూ, కారణం లేకుండా కోప్పడే వాళ్లకి దూరంగా ఉండాలి” అని చెప్తున్నాడు చాణక్యుడు. అందుకే, చెడు వ్యసనాలు, చెడు సావాసాలు, ద్వేషంతో నిండినవాళ్లు, ఇతరులను తక్కువ చేసి చూసేవాళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు అవతలి వాళ్లను మానసికంగా దెబ్బతియ్యాలనే ఉద్దేశంతోనే అలాంటి కామెంట్లు చేస్తారు. అందుకే, మన మంచి కోరేవారు ఎవరు? చెడు చేసేవారు ఎవరు? అనే విషయాన్ని ముందే తెలుసుకోవాలి. ‘ఇలా కాకుండా ఇంకోలా చేస్తే ఎప్పటికైనా గెలిచి తీరుతావు’ అని భరోసా ఇస్తారు మన మంచి కోరేవారు. ‘ఇలా చేస్తే ఎప్పటికీ గెలవలేవు’ అని చెప్పేవాళ్లు ఏదో చెడు ఉద్దేశంతోనే అలా అంటారు. అలాంటి వారికి ఎప్పటికీ దూరంగా ఉండటమే మంచిది అని సూచిస్తాడు చాణక్యుడు.    


మానసికంగా దెబ్బతియ్యాలనే..
‘అసలు నేను సక్సెస్‌‌ అయితే, వీళ్లకు ఏంటి? నా నుంచి ఏం కోరుకుంటున్నారు?’ అనే ఆలోచనల్లో పడి ఇబ్బందులు పడుతుంటారు చాలామంది. అలా ఆలోచనల్లో పడేసి మిమ్మల్ని మానసికంగా దెబ్బతియ్యాలనే ఆలోచనతోనే చాలామంది నెగెటివ్‌‌ కామెంట్లు చేస్తుంటారు. వాళ్ల వాళ్ల జీవితాల్లో కొన్ని కారణాల వల్ల సక్సెస్‌‌ కాకపోవడం, ఏది చేసినా కలిసి రాకపోవడం లాంటివి జరుగుతుంటాయి. అందుకే అసూయతో పక్కవాళ్లపైన కోపాన్ని పెంచుకుంటారు. వాళ్లలో నెగెటివిటీని పెంచుకుని  పక్కవాళ్లపై దాన్ని చూపిస్తుంటారు. అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టి వాళ్ల ఇబ్బందుల్ని చూసి ఆనందిస్తారు. అందుకే, అలాంటి వాళ్లను ముందుగానే గుర్తించాలి. నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ చేసేవారినుంచి దూరంగా వెళ్లిపోవాలని చెప్తున్నాడు. వాళ్లను ముల్లుతో పోలుస్తాడు చాణక్యుడు. “ నెగెటివ్‌‌ కామెంట్లు చేసేవాళ్లు ముల్లు లాంటివాళ్లు. వాళ్ల స్వభావం తెలియగానే చెప్పుతో తొక్కేయాలి లేదా దూరంగా వెళ్లిపోవాలి” అని చెప్తాడు చాణక్యుడు.

మార్చాలి అనుకోవడం.. 
చుట్టూచేరి నెగెటివ్‌‌ కామెంట్స్‌‌ చేయడం, చేసే పనిని తప్పుబట్టే వారిని మార్చడం అంత సులవు కాదని చెప్తాడు చాణక్యుడు. ‘ వేప చెట్టుకి పాలు పోసినా, నెయ్యి పూసినా దాని రుచి మారదు. సహజంగా వచ్చిన చేదు పోదు. అలానే పుట్టుకతో, సహజంగా వచ్చే లక్షణాలను మార్చడం సులువు కాదు. వాళ్లకై వాళ్లే అనుకుంటే తప్ప మార్పురాదు. చెడ్డ వాళ్లను మంచివాళ్లుగా మార్చే మార్గం అంత సులభం కాదు. చాలామంది ‘అదెంత పని, మాటలతో మార్చేయొచ్చు’ అని గొప్పలు చెప్తారు. కానీ, స్వయంగా అనుభవం అయితే తప్ప ఆ విషయం  అర్థంకాదు. అందుకే, వాళ్లను మార్చాలనే ప్రయత్నాలు చేసి, తర్వాత వాళ్లు చేసే ఇంకొన్ని ఆరోపణలు, కామెంట్స్‌‌  విని బాధపడకుండా ఉండటం మంచిది. అలాంటి వాళ్లను ఎంత దూరంగా ఉంచుతామో.. జీవితంలో అంత ఎత్తుకు ఎదగగలం” అని చెప్పాడు చాణక్యుడు

- శ్రీహిత