మూడు సర్కారు దవాఖాన్లు తిరిగినా ఎవరూ పట్టలె

మూడు సర్కారు దవాఖాన్లు తిరిగినా ఎవరూ పట్టలె

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా కష్టకాలంలో సర్కార్ దవాఖాన్ల తీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్లను సైతం దవాఖాన్లలో చేర్చుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నయి. సర్కార్ దవాఖాన్లలో అడ్మిషన్‌‌కు నిరాకరిస్తుండడంతో, బాధితులు ప్రైవేటు హాస్పిటల్స్‌‌కి వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. బుధవారం ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌‌లోని మాణికేశ్వరి నగర్‌‌‌‌లో నివాసం ఉంటున్న 55 ఏండ్ల ఓ మహిళకు ఈ నెల 12న జ్వరం వచ్చింది. 13 వ తేదీన శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆమెను ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్షించి కింగ్‌‌ కోఠి హాస్పిటల్‌‌కు రిఫర్ చేశారు. అంబులెన్స్‌‌లోనే మహిళను పరీక్షించిన డాక్టర్లు గాంధీకి వెళ్లాలని సూచించారు. గాంధీకి తీసుకెళ్తే ఉస్మానియా హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అప్పటికే తల్లి పరిస్థితి విషమిస్తుండడం, ఉస్మానియాకు వెళ్లిన పరిస్థితి ఇట్లనే ఉంటుందన్న అంబులెన్స్ డ్రైవర్ సూచనతో అక్కడి నుంచి ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్‌‌కు తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజులకే రూ. మూడున్నర లక్షల బిల్లు వేశారు. మంగళవారం చేసిన టెస్ట్‌‌లో కరోనా పాజిటివ్‌‌గా తేలింది. దీంతో రోజుకు రూ. లక్ష చొప్పున, 14 రోజులకు రూ.14 లక్షల బిల్లు అవుతుందని హాస్పిటల్‌‌ వర్గాలు బాధితురాలి కుమారునికి తెలియజేశాయి.

గవర్నమెంట్ జీవో చెల్లదంటున్నరు

శనివారం ఉదయం మా అమ్మకు శ్వాస తీసుకోవటం ఇబ్బంది కావటంతో 3 ప్రభుత్వ దవాఖాన్లు తిరిగినం. పేషెంట్ కండిషన్ సీరియస్ ఉన్నా అటు, ఇటు తిప్పారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో యశోద హాస్పిటల్ కు తీసుకెళ్లాం. ట్రీట్ మెంట్ ఇచ్చారు. మంగళవారం కరోనా టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పారు. ఇప్పటికే రూ. 3. 5 లక్షల బిల్లు కట్టాం. కరోనా కావటంతో రూ. లక్ష చొప్పున 14 రోజులు రూ.14 లక్షలు అవుతుందని చెబుతున్నారు. గవర్నమెంట్ జీవో ఉంది కదా అని అడిగితే… అవన్నీ మా దగ్గర చెల్లవు అంటున్నారు. ఇప్పుడు ఏంచేయాల్నో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ జీవో ప్రకారం డబ్బులు తీసుకునేలా చూడాలి.
– రహ్మత్‌‌ అలీ, బాధితురాలి కొడుకు, మాణికేశ్వరి నగర్‌‌

మళ్లీ లాక్ డౌన్ ఉండదు