రామగుండంలో రోడ్లపైనే చెత్త

రామగుండంలో  రోడ్లపైనే చెత్త
  • ఇంటింటి చెత్త సేకరణపై 
  • సిబ్బంది పర్యవేక్షణ శూన్యం
  • కూడళ్లలో పారపోస్తున్న జనం
  • అవగాహన కల్పించడంలో యంత్రాంగం ఫెయిల్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం నీరుగారుతోంది. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఇంటింటి చెత్త సేకరణ అంతంతమాత్రంగానే సాగుతోంది. పర్యవేక్షణ, అవగాహన కల్పించకపోవడంతో చాలా ఏరియాల్లో పట్టణవాసులు స్వచ్ఛ ఆటోల్లో చెత్త వేయకుండా ప్రధాన రోడ్ల పక్కన, కూడళ్లలో చెత్త పారేస్తున్నారు. 

ప్రతి డివిజన్‌‌‌‌కు వార్డు ఆఫీసర్, సూపర్‌‌‌‌‌‌‌‌వైజర్లు ఉన్నా.. రోడ్లపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవడంలో ఫెయిల్‌‌‌‌ అవుతున్నారు. ఇటీవల 100 రోజుల ప్రణాళిక భాగంగా ప్రజలకు అవగాహన కల్పించకుండా కేవలం ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి వాటి ముందు ఫొటోలు దిగడానికే ఆఫీసర్లు, సిబ్బంది పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. 

డైలీ 80 మెట్రిక్​ టన్నుల చెత్త 

రామగుండం కార్పొరేషన్​ పరిధిలో 60 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్‌‌‌‌కు స్వచ్ఛ ఆటోను కేటాయించారు. వీటి ద్వారా ఇళ్ల నుంచి సుమారుగా 80 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దీనిలో 13 ట్రాక్టర్ల ద్వారా సుమారు 50 మెట్రిక్‌‌‌‌ టన్నులు మాత్రమే డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మార్కండేయకాలనీ, స్వతంత్రచౌక్, లక్ష్మీనగర్, కల్యాణ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లాంటి కొన్ని ఏరియాల్లో ఇండ్ల నుంచి చెత్తను తీసుకువచ్చి రోడ్ల కూడళ్లలో పారపోస్తున్నారు. ఇలా చెత్తను పారపోసేవారికి అవగాహన కల్పించాల్సి ఉంది. అయినా తీరుమారని వారికి రూ.500 ఫైన్ విధించాల్సి ఉన్నా సిబ్బంది 
పట్టించుకోవడం లేదు. 

 గోదావరిఖనిలోని లక్ష్మీనగర్​, కల్యాణ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, స్వతంత్ర చౌక్​ ప్రాంతాల్లో పలు హాస్పిటళ్ల వ్యర్థాలు కూడా రోడ్లపైనే పారపోస్తున్నారు. రక్తం తడిసిన కాటన్‌‌‌‌, సర్జికల్​ బ్లేడ్​, సూది, యూరిన్​ బ్యాగ్​, బ్లడ్​ బ్యాగ్, తదితర బయో మెడికల్​వేస్ట్‌‌‌‌ను కూడా చెత్తలో కలిపేసి రోడ్లపైనే పడేస్తున్నారు. ఇటీవల ఇలా బయోమెడికల్​ వేస్ట్‌‌‌‌ను బయటపడేస్తున్న శ్రీఅదితి హాస్పిటల్‌‌‌‌కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్​కు రూ.50 వేలు, వెంకటస్వాయి క్లినికల్​ ల్యాబ్​కు రూ.10 వేల చొప్పున ఫైన్​ వేశారు. అయినా పలు హాస్పిటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు. 

అవగాహన కల్పించడంలో విఫలం 

రామగుండం కార్పొరేషన్‌‌‌‌ పరిధిలో ఇంటింటికి చెత్తను సేకరించడానికి ముందుగా ‘ర్యాగ్​ ఫిక్కర్’  వ్యవస్థను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆటోల ద్వారా చెత్తను సేకరించి, ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేసేవారు.

 ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తను వేసేందుకు గ్రీన్​, బ్లూ కలర్​ డబ్బాలను పంపిణీ చేశారు. ఆ తర్వాత స్వచ్ఛ ఆటోలను తీసుకువచ్చారు. నేటికి ఆ వ్యవస్థ కొనసాగుతున్నప్పటికీ కొందరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆటోల్లో చెత్త వేయకుండా 
బయట పడేస్తున్నారు.