గర్భిణికి ఆపరేషన్ చేశారు.. కడుపులో కాటన్ ప్యాడ్ మరిచారు

గర్భిణికి ఆపరేషన్ చేశారు.. కడుపులో కాటన్ ప్యాడ్ మరిచారు

మంచిర్యాల జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కాటన్ ప్యాడ్ ను మర్చిపోయారు. బాధితురాలికి తీవ్ర అస్వస్థత కావడంతో అసలు విషయం బయటపడింది. 

బాధితురాలు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...  

వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయ అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు చిన్న ఆపరేషన్  చేయడంతో కీర్తి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఇక్కడే డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 

ఆపరేషన్ చేసిన డాక్టర్లు, సిబ్బంది కీర్తి కడుపులో కాటన్ ప్యాడ్ ను మర్చిపోయారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సోమవారం రోజు రాత్రి (ఆగస్టు 29వ తేదీన) కీర్తి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్లు బాలింత కీర్తిని పరీక్షించారు. మంచిర్యాల జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన డాక్టర్లు, వైద్య సిబ్బంది కీర్తి కడుపులో కాటన్ పాడ్ మర్చిపోయినట్లు గుర్తించి.. వెంటనే దాన్ని తొలగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో మంచిర్యాల జనరల్ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.