బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. 4 వేల ఇండ్లకు తాగునీళ్లు బంద్

బల్దియా అధికారుల నిర్లక్ష్యం.. 4 వేల ఇండ్లకు తాగునీళ్లు బంద్
  • నాగోల్ డివిజన్​లో పనులు చేస్తుండగా వాటర్ పైప్ లైన్ ధ్వంసం
  • నీళ్లు రాక రెండ్రోజులుగా ఇబ్బంది పడుతున్న స్థానికులు

ఎల్ బీనగర్, వెలుగు:  ఎస్ఎన్ డీపీ( స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్)లో భాగంగా నాగోల్ డివిజన్ లో చేపట్టిన నాలా పనుల్లో బల్దియా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ధ్వంసమైంది. దీంతో 4 వేల ఇండ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బల్దియా హయత్ నగర్ సర్కిల్ నాగోల్ డివిజన్‌‌ మమతానగర్​లో రెండ్రోజుల కిందట బల్దియా కాంట్రాక్టర్ నాలా పనులు చేపట్టాడు. 

ఇందుకోసం రోడ్డుపై తవ్వకాలు చేపట్టాడు. అయితే, దీనిగురించి వాటర్ బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వలేదు. బుధవారం సాయంత్రం పనులు చేస్తుండగా భారీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ధ్వంసమైంది. దీంతో డివిజన్​లోని మమతా నగర్, వెంకటరమణ నగర్ కాలనీలోని సుమారు 4 వేల ఇండ్లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. రెండ్రోజులు తాగునీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాలనీలోని ఇండ్లకు వెళ్లేందుకు కూడా దారి లేకుండా గుంతలు తవ్వారని అధికారులు, కాంట్రాక్టర్ల తీరుపై స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ మండిపడ్డారు. సమస్యను తొందరగా  పరిష్కరించాలన్నారు.