- బిల్లులు రాకుంటే మార్కెట్ ను కాంట్రాక్టర్ కబ్జా చేస్తారా..?
- ఎమ్మెల్యే సంజయ్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీలో జరిగిన ఏసీబీ, విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే అభివృద్ధికి నిదర్శనమా? అని ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల మున్సిపాలిటీని అవినీతికి కేంద్రంగా మార్చారని, చైర్ పర్సన్ సీటు ఖాళీ అయినప్పుడు చట్టంలోని లోసుగులను ఆసరాగా చేసుకుని బలహీనవర్గాల హక్కులను కాజేశారని ఆరోపించారు.
బిల్లులు రాకపోతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కబ్జా చేసి కాంట్రాక్టర్ సిమెంట్ గోదాంగా మార్చుతారా..? అంటూ ప్రశ్నించారు. మార్కెట్ ను ప్రారంభించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వినియోగంలోకి తీసుకురాకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఉన్నది మాట్లాడితే ఉలికిపడటం ఎందుకని ఆయన నిలదీశారు.
గత ఐదేండ్ల మున్సిపల్ పాలకమండలి కాలంలో 16 మంది కమిషనర్లు మారారని, 8 మంది ఉద్యోగులు జైలు పాలు అయ్యారని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి తెలంగాణలోనే కాదు దేశంలోనే ఎక్కడా లేదన్నారు. ఇదేనా మీ ప్రగతి అని ఎమ్మెల్యేను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పదేండ్లుగా అభివృద్ధి చేసి ఉంటే ఎవరు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు.
