
- గత ప్రభుత్వం నిధులివ్వక తీవ్ర నిర్లక్ష్యం
- ప్రస్తుత సర్కార్ లో ముమ్మరంగా పనులు
- సాగులోకి రానున్న 25 వేల ఎకరాలు
- నెరవేరనున్న 30 ఏండ్ల
- గిరిజనుల కల ప్రాజెక్టు పూర్తికి ఎమ్మెల్యే, ఆఫీసర్ల కృషి
నల్గొండ/హాలియా, వెలుగు: నల్గొండ జిల్లాలోని నెల్లికల్లు లిఫ్ట్ స్కీమ్ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. తిరుమలగిరి (సాగర్) మండలంలోని 24,886 ఎకరాల బీడు భూములకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో రూ.539.91 కోట్లతో పనులు చేపట్టింది. సరిగా నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణం ముందుకు సాగలేదు. పంపు హౌస్, పైప్లైన్ వంటి పనులను పట్టించుకోకపోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే నిధుల మంజూరుతో మళ్లీ పనుల్లో స్పీడ్ పెరిగింది. త్వరలోనే పనులు పూర్తయి అందుబాటులోకి వస్తే.. దశాబ్దాల గిరిజనుల కల నెరవేరనుంది.
నిధులు ఇవ్వక నిలిచిన పనులు
నెల్లికల్లు లిఫ్ట్ స్కీమ్ ను రూ.72.16 కోట్లతో నిర్మించి, 4,175 ఎకరాల భూమికి సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2021 ఫిబ్రవరిలో లిఫ్ట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అనంతరం లిఫ్ట్ సామర్థ్యం, నిర్మాణ వ్యయం పెంచితే కృష్ణపట్టె ప్రాంతంతో పాటు తిరుమలగిరి(సాగర్) మండలంలోని భూములను పూర్తిస్థాయిలో సాగులోకి తేవచ్చని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఇక్కడ పర్యటించి గత సర్కార్ కు నివేదిక అందించింది. దీంతో నిర్మాణ ప్రతిపాదనల్లో కొంత మార్పు చేసి నివేదికను అందించాలని నీటి పారుదల శాఖను ఆదేశించింది.
లిఫ్ట్ నిర్మాణ వ్యయాన్ని రూ.72.16 కోట్ల నుంచి రూ.694 కోట్లకు పెంచింది. ఆయకట్టు సాగు విస్తీర్ణాన్ని 4,175 ఎకరాల నుంచి 24,886 ఎకరాలకు పెంపు చేస్తూ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. లిఫ్ట్ రీ డిజైన్, కృష్ణానదికి వచ్చే వరద కారణంగా నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. కరోనా రావడంతో ఏడాదిపాటు లిఫ్ట్ పంప్ హౌజ్ నిర్మాణం, వైపు పైప్ లైన్ పనులు పెండింగ్లో పడ్డాయి. అనంతరం 2023లో అప్పటి ప్రభుత్వం కేవలం రూ.40 కోట్లను కేటాయించడంతో పనులు ముందుకు సాగలేదు. నెల్లికల్లు లిఫ్ట్పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నెలలోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మళ్లీ లిఫ్ట్ పనులను చేపట్టింది. దీంతో నెల్లికల్లు, ఎర్ర చెరువు తండా వరకు లిఫ్ట్ పైప్ లైన్ నిర్మాణానికి అధికారులు భూ సర్వే పూర్తి చేశారు. పనులను వేగంగా చేసేందుకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి ఇరిగేషన్ అధికారులతో పలుమార్లు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నిధుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రూ.131.40 కోట్లను మంజూరు చేయించారు. దీంతో ప్రాజెక్ట్ పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించేలా కృషి చేశారు.
వేగంగా పంప్ హౌస్ నిర్మాణం
నెల్లికల్ ఎక్స్ రోడ్ సమీపంలో కృష్ణానది ఒడ్డున పంప్ హౌస్ ను వేగంగా నిర్మిస్తున్నారు. మోటర్ బిగింపు కోసం కాంక్రీట్ బెడ్, వాల్ పైకప్పు స్లాబ్ పనులు కొనసాగుతున్నాయి. సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ లెవల్ లో 510 అడుగుల నుంచి పంప్ హౌస్ వద్ద 5 మెగావాట్ల పవర్ కలిగిన మొత్తం నాలుగు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. వాటి ద్వారా 120 ఫీట్ల ఎత్తు నీటిని లిఫ్ట్ చేసి పైపుల నుంచి నీటిని తరలిస్తారు. ఒకవేళ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు నది నుంచి పంప్ హౌస్ వరకు తరలించేందుకు సుమారు 450 మీటర్ల మేరకు కాల్వను నిర్మించారు. సుమారు 8 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేసి పొలాలకు నేరుగా నీటిని తరలించేందుకు పంట కాల్వలు నిర్మించనున్నారు.
ముమ్మరంగా పైపు లైన్ల ఏర్పాటు
కృష్ణా నదిలోని పంప్ హౌస్ వద్ద నుంచి సుమారు 19.6 కిలోమీటర్ల మేరకు రెండు వరుసల పైపులైన్లు వేయనున్నారు. ఇందులో భాగంగా ఫేస్–1 లో 4.5 కి.మీ, ఫేస్ –2 లో4 కి.మీ పైపుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మిగిలిన పైప్ లైన్ ఏర్పాట్లకు అధికారులు భూ సేకరణ ముమ్మరం చేశారు. ఫేస్ –3 ప్రాజెక్టును విస్తరించేందుకు అధికారులు ప్లాన్ సిద్ధం చేశారు. పైపులైన్ నిర్మాణానికి ప్లేస్ మెంట్ ఏరియా కోసం ఇప్పటికే 21 ఎకరాల భూమిని సేకరించారు.
గ్రావిటీ ప్లేస్ మెంట్ కోసం మరో 60 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. పైప్ లైన్ల నిర్మాణం పూర్తయిన వెంటనే రైతుల భూములకు నీటిని అందించేందుకు ఫీల్డ్ చానల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. పొలాల వరకు డిస్ట్రిబ్యూటరీ మైనర్ కాల్వలను కూడా ఏర్పాటు చేస్తారు. పైప్ లైన నిర్మాణానికి ఇప్పటికే పలు గ్రామాల్లో అధికారులు సర్వే చేశారు. భూముల్లోంచి వెళ్లే రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించనున్నారు. ప్రాజెక్ట్ పంప్ హౌస్ నిర్మాణ పనులు, పైపు లైన్ల ఏర్పాటు, భూసేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఆరు నెలల్లోనే లిఫ్ట్ పనులు పూర్తి చేస్తాం
నెల్లికల్ లిఫ్ట్ స్కీమ్ ను ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. వచ్చే వానాకాలం నాటికి రైతుల పంటలకు సాగునీరు అందించేలా కృషి . నాడు మంత్రిగా జానారెడ్డి హయాంలోనే కృష్ణపట్టె ప్రాంతంలోని బీడు భూములకు సాగును అందించాలనే ఉద్దేశంతో నెల్లికల్ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణానికి నిర్ణయించారు. నేడు నా హయాంలో నాటి కల నెరవేరి లిఫ్ట్ స్కీమ్ పూర్తి చేసేందుకు అంకురార్పణ జరిగింది.
కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున సాగర్