దక్షిణ బంగాళాఖాతంలో తుఫాను.. సముద్రం అల్లకల్లోలం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలో తుఫాను.. సముద్రం అల్లకల్లోలం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారింది. తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక జారీ చేసింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఇది పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ బుధవారం మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు తీవ్ర రూపం దాల్చుతుంది. ఆ తరువాత, తుఫాను పశ్చిమ -వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతుందని.. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

గత వారం రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైతో సహా తమిళనాడులోని చాలా ప్రాంతాలు వరద పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర సముద్రం తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారుతుంది. రాబోయే రెండు రోజులు సముద్రం భయంకరంగా మారుతుంది. మత్స్యకారులు, తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిది.

చెన్నై, పెరంబలూరు, తంజావూరు, తిరువారూర్, తిరువళ్లూరు, కాంచీపురం, రాణిపేట్, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, అరియలూర్, నాగపట్నం జిల్లాలు.. కారైకల్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుచిరాపల్లి, వెల్లూరు, తిరుపత్తూరు, ధర్మపురి, సేలం.. పుదుక్కోట్టై జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. చెన్నైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు.

ఈ తుఫాను కారణంగా బుధవారం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ 23న.. గురువారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతిలో అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీ సత్యసాయి, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అక్టోబర్ 22 నుంచి 25 వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కి.మీ వేగంతో, గంటకు 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రా తీరం వెంబడి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తిరిగి రావాలని, ఈ సమయంలో బంగాళాఖాతంలోకి వెళ్లకూడదని సూచించారు.