
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ డ్రామా ‘నేనే రాజు నేనే మంత్రి’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆరేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. గోపీనాథ్ ఆచంట దీన్ని నిర్మిస్తున్నారు. గత చిత్రంలోని జోగేంద్ర పాత్రతో రానాలోని నటుడిని సరికొత్తగా ఆవిష్కరించిన తేజ.. ఇందులో మరింత పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో రానాను చూపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మలయాళ స్టార్ హీరో ఒకరు ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నారని, పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నట్టు నిర్మాత గోపీనాథ్ చెప్పారు. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, జంబలకిడి పంబ లాంటి కామెడీ చిత్రాలతో పాటు బాలకృష్ణతో టాప్ హీరో, దేవుడు లాంటి సినిమాలను నిర్మించిన ఆయన.. ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు.