నేపాల్‎లో కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు.. ఇప్పటికే 16 మంది మృతి..!

నేపాల్‎లో కనిపిస్తే కాల్చేయాలని ఆదేశాలు.. ఇప్పటికే 16 మంది మృతి..!

ఖాట్మండు: నేపాల్‎లో Z-జెన్ యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మకంగా మారింది. రోజురోజుకు ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఆర్డర్స్ జారీ చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులను కనిపిస్తే కాల్చిపడేయండని ఆదేశించింది.

గత నాలుగు రోజులుగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన నిరసన తెలుపుతున్న యంగ్ జనరేషన్ సోమవారం (సెప్టెంబర్ 8) నేపాల్ పార్లమెంట్ ముందు భారీ ప్రొటెస్ట్ చేపట్టింది. ఈ క్రమంలోనే వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆందోళనకారులు పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులు కాల్పుల్లో గాయపడి వివిధ ప్రాంతాల్లో 16 మంది మృతి చెందగా.. దాదాపు 100 మందికి పైగా యువత గాయపడ్డారు. యువత చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుండటంతో నేపాల్ రాజధాని ఖాట్మండు, న్యూ బనేశ్వర్‌,  పోఖారా, బుత్వాల్, భైరహవా, ఇటాహరి, రూపండేహి, సున్సారీతో పాటు పలు ప్రాంతాల్లో కర్య్ఫూ విధించారు.

కఠినమైన ఆంక్షలను అమలు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలు, సిట్-ఇన్‌స్ట్రక్షన్‌లపై నిషేధం విధించారు. ఉద్యమం హింసాత్మకంగా మారిన ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు అధికారులు. నిరసనకారులను కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే..?

నేపాల్‎లో సోషల్ మీడియా బ్యాన్ చేయడంతో యువత పెద్దఎత్తున నిరసనలకు దిగారు. ప్రభుత్వం తమ వాక్ స్వాతంత్ర్యాన్ని కాలరాస్తోందంటూ ఆందోళనబాట పట్టారు. 2025, సెప్టెంబర్ 4న ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‎లను ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఉద్యమం మొదలైంది. దీంతో విప్లవం వైపుగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వ అవినీతి బయటకు రావద్దనే బ్యాన్ చేశారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.

►ALSO READ | నేపాల్ దేశంలో కుర్రోళ్లు రగిలిపోతున్నారు.. వీధుల్లో బీభత్సం చేస్తున్నారు.. సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు..?

మరోవైపు ప్రభుత్వం ఈ చర్యను సమర్ధించుకుంటోంది. ప్రభుత్వ పాలసీల్లో భాగంగానే సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసినట్లు చెబుతున్నారు. గైడ్ లైన్స్ పాటించనందున పలు సైట్లను బ్యాన్ చేసినట్లు ప్రధాన మంత్రి శర్మ ఓలి తెలిపారు. దేశాన్ని తగ్గించాలని చూస్తే ఎలాంటి మాధ్యమాలనైనా బ్యాన్ చేస్తామని ఆయన తెలిపారు.