
- ఇండియన్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం..
- ఫారిన్ ఇన్వెస్టర్లు తమ ఫండ్స్‌ను విత్‌డ్రా చేసుకోవడమే కారణం
- 2020-21లో నెట్ ఎఫ్‌డీఐల విలువ 44 బిలియన్ డాలర్లు..
- 2024-25లో కేవలం 0.4 బిలియన్ డాలర్లే
న్యూఢిల్లీ: కరోనా తర్వాత ఇండియా నెట్ ఎఫ్‌డీఐలు తగ్గాయని ఆర్‌బీఐ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇండియన్ కంపెనీలు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచడం, ఫారిన్ కంపెనీలు తమ డబ్బును తిరిగి తమ దేశాలకు తీసుకెళ్లడం (రిపాట్రియేషన్) వల్ల ఇండియా నెట్ పారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ (ఎఫ్‌డీఐలు) కరోనా సంక్షోభం తర్వాత నుంచి చూస్తే 96 శాతం కంటే ఎక్కువ పడ్డాయి.
2024–-25లో ఇండియాలో నెట్ ఎఫ్‌డీఏలు 353 మిలియన్ డాలర్లకు (సుమారు 0.4 బిలియన్ డాలర్లకు) తగ్గాయి. నెట్ ఎఫ్‌డీఐ అంటే, గ్రాస్ ఎఫ్‌డీఐ (ఇండియాలోకి వచ్చే మొత్తం ఫారిన్ పెట్టుబడుల) నుంచి, ఇక్కడ బిజినెస్ చేస్తున్న ఫారిన్ కంపెనీలు తమ దేశాలకు తిరిగి తీసుకెళ్లే ఫండ్స్, ఇండియన్ కంపెనీలు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చేసే ఖర్చును తీసేస్తే వచ్చేది.
గ్రాస్ ఎఫ్‌డీఐ బాగానే ఉన్నప్పటికీ, ఫారిన్ కంపెనీలు ఎక్కువ డబ్బును తమ దేశాలకు తిరిగి తీసుకెళ్లడం, ఇండియన్ కంపెనీలు ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల నెట్ ఎఫ్‌డీఐ బాగా తగ్గింది. ‘‘కరోనా సంవత్సరం 2020–-21లో నెట్ ఎఫ్‌డీఐ 44 బిలియన్ డాలర్లుగా ఉండగా, తర్వాత ఏడాది 38.6 బిలియన్ డాలర్లకు, 2022-–23లో 28 బిలియన్ డాలర్లకు, 2023–-24లో 10.1 బిలియన్ డాలర్లకు, ఇప్పుడు 2024-–25లో కేవలం 0.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది’’ అని ఆర్‌బీఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది.
ఇండియాలో బిజినెస్ చేస్తున్న ఫారిన్ కంపెనీల రిపాట్రియేషన్ (ఫండ్స్ వెనక్కితీసుకోవడం) , డిజి న్వెస్ట్‌మెంట్ 2024-–25లో 51.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. 2023–24లో ఇది 44.5 బిలియన్ డాలర్లుగా ఉంది. “ ఫారిన్ ఇన్వెస్టర్లు సులభంగా ఎంటర్ అయి ఎగ్జిట్ అవ్వగలుగుతున్నారు. ఇది ఇండియన్ ఎకానమీకి సానుకూల అంశం.
ఇండియా మార్కెట్ మెచ్యూర్‌గా ఉందనే విషయం తెలుస్తోంది” అని ఆర్‌బీఐ వెల్లడించింది. మరోవైపు, గ్రాస్ ఇన్వెస్ట్‌మెంట్ బాగున్నాయి. 2024-–25లో 81 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇండియాలోకి వచ్చాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 71.3 బిలియన్ డాలర్లుగా, 2022–-23లో 71.4 బిలియన్ డాలర్లుగా ఉంది. “గ్రాస్ ఎఫ్‌డీఐలో 60 శాతం కంటే ఎక్కువ ఫండ్స్ మాన్యుఫాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, ఇతర ఎనర్జీ, కమ్యూనికేషన్ సర్వీసెస్ సెక్టార్స్‌లోకి వచ్చాయి.
సింగపూర్, మారిషస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూఎస్ నుంచి 75 శాతం కంటే ఎక్కువ ఫండ్స్ వచ్చాయి” అని ఆర్‌బీఐ వివరించింది. మరోవైపు నెట్ ఎఫ్‌డీఐ బాగా తగ్గడానికి మరో కారణం ఇండియన్ కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెంచడమే. 2024–-25లో ఇండియన్ కంపెనీలు ఇతర దేశాల్లో మొత్తం 29.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇది 2023–24 కంటే 75 శాతం ఎక్కువ.