
హైదరాబాద్ , వెలుగు: ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నెట్‌లింక్స్ లిమిటెడ్ 2023 మార్చి క్వార్టర్లో లాభంలో 55 శాతం గ్రోత్ సాధించింది. 2022 క్యూ4 లో కంపెనీకి రూ. 38 లక్షల లాభం రాగా, తాజా క్యూ4 లో అది రూ. 59 లక్షలకు పెరిగింది. రెవెన్యూ కూడా మార్చి 2023 క్వార్టర్లో 30 శాతం పెరిగి రూ. 3.40 కోట్లకు చేరింది. మార్చి 2023 తో ముగిసిన పూర్తి ఫైనాన్షియల్ ఇయర్‌కు చూస్తే కంపెనీ రెవెన్యూ రూ.10.17 కోట్లకు, నికర లాభం రూ. 1.36 కోట్లకు పెరిగాయి. అంటే నికర లాభం 28 శాతం ఎగసింది.
ఐఎస్పీ బిజినెస్‌పై ఫోకస్ మరింత పెంచాలని నిర్ణయించినట్లు నెట్‌లింక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ లోకారెడ్డి చెప్పారు. వచ్చే రెవెన్యూను గ్రోత్ కోసమే వెచ్చించనున్నామని పేర్కొన్నారు. 2023–24 లో ఆదాయంలో 100 శాతం గ్రోత్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నామని, లాభాలు కూడా భారీగా పెంచుకోవాలనుకుంటున్నామని మనోహర్ వెల్లడించారు.1993 నుంచి ఐఎస్పీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కస్టమర్లకు సేవలు అందిస్తోందని అన్నారు. కేబుల్, వైర్‌లెస్ ఇంటర్నెట్ యాక్సెస్, వెబ్ డిజైన్, పోర్టల్ డెవలప్‌మెంట్, వెబ్ హోస్టింగ్, సర్వర్ కో-లొకేషన్ వంటి సర్వీసెస్‌ను నెట్‌లింక్స్ లిమిటెడ్ అందిస్తోంది.