స్వాతంత్ర్య సమరంలో..నేషనల్ హీరో సుభాష్ చంద్రబోస్

స్వాతంత్ర్య సమరంలో..నేషనల్ హీరో సుభాష్ చంద్రబోస్

భారతదేశ స్వాతంత్ర్య సమరంలో మనం  స్మరించుకోదగినవారిలో  నేషనల్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. మనం ఆయన మరణం మిస్టరీ కంటే ఆయన సృష్టించిన చరిత్రను చదవవలసిన అవసరం ఉంది. 1945 ఆగస్టు 15వ తేదీన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు , ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ యుద్ధంలో ఓడిపోయాయి. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది. కానీ, యుద్ధంలో గెలిచిన ఆనందం లేకుండా బ్రిటన్ వారందరినీ వేధించిన ఒకే ప్రశ్న సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు?. ఈ ప్రశ్ననుబట్టి  నేతాజీ..బ్రిటిష్​ వారిని ఎంత భయాందోళనలకు గురిచేశాడో అర్థం చేసుకోవచ్చు.

ఆ కాలంలో అత్యున్నతమైన ఉద్యోగాల కోసం జరిగే పరీక్ష ఐసీఎస్. ఈ పరీక్షలో బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు,  బ్రిటన్ అధికారుల పిల్లలు నాలుగైదు సార్లు ప్రయత్నం చేసినా పాస్ అవడం అసాధ్యం. ఇలాంటి పరీక్షను 1921లో  కేవలం 24 సంవత్సరాల వయసులో రాసి మొదటి ప్రయత్నంలోనే కేవలం 6 నెలల కాలంలో డిస్టింక్షన్​లో  పాస్ అయినవాడు సుభాష్ చంద్రబోస్. అలా ఉన్నతమైన ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు సుభాష్ బాబు. అప్పటినుంచి సుభాష్ చంద్రబోస్​ మీద విపరీతమైన కక్షను పెంచుకుంది బ్రిటిష్ ప్రభుత్వం.1924లో బ్రిటిష్ పార్లమెంటులో ఆయన గురించి  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే దాదాపు 11 సార్లు ఆయనను మాండలే జైల్లో వేసి, చిత్రహింసలకు గురి చేశారు. 

ఐఎన్​ఏ ఏర్పాటు

1939లో కాంగ్రెస్​కు అధ్యక్షుడు అయిన తర్వాత రష్యాకి వెళ్లి స్టాలిన్​ను కలవాలనే ప్రయత్నం చేశాడు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి సహాయం చేయమని అడగడానికి ప్రయత్నం చేసి విజయం సాధించాడు. జపాన్, జర్మనీ లాంటి దేశాలతో మాట్లాడి ఉద్యమాన్ని నడిపించాడు. 1943 ఫిబ్రవరిలో జలాంతర్గామి ద్వారా సాహసోపేతమైన ప్రయాణాన్ని కొనసాగించి జర్మనీ చేరుకొని హిట్లర్​ను కలిసి భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సహకరించడానికి ఒప్పించాడు. అనేక దేశాలలో పర్యటించి ఆ దేశంలోని భారతీయ సంతతికి చెందిన వాళ్లందర్నీ నేతాజీ కలిశాడు. వారిని ప్రభావితం చేసి వారందరూ రాజ్ బిహారీ బోస్ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్​ఏ)లో చేరేటట్టు ప్రోత్సహించాడు. ఆయన ప్రభావానికి లోనైన ఆ ప్రవాస భారతీయుల కుటుంబాలకు కుటుంబాలే ఐఎన్ఏలో చేరాయి. దాదాపు 40 వేల మందితో ఐఎన్ఏ ఏర్పాటైంది. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను’ అని నినదించాడు.  చేవ చచ్చిన చేతులతో అర్థిస్తే స్వాతంత్ర్యం రాదు. పిడికిలి బిగించి గర్జించాలి అంటూ బెర్లిన్ నుంచి రేడియో ప్రసంగం ద్వారా భారతీయులను ఉత్తేజపరిచి ప్రత్యేక ఆర్మీని తయారు చేశాడు.

అండమాన్​ ప్రధానిగా..

అండమాన్​లో స్వతంత్ర జెండాను ఎగరవేసి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ విషయాన్ని ప్రపంచంలో దాదాపు 8 దేశాలు గుర్తించాయి. 1939 నుంచి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓడిపోయింది. కానీ, బ్రిటిష్​ వాడి గుండెలలో గుబులు పుట్టించే సాహసాన్ని చేశారు ఆ సైనికులు. జర్మనీ నుంచి మనం సహాయాన్ని పొందినప్పటికీ వారికి లొంగి ఉండలేదు.   1945 ఆగస్టు 18వ తేదీన రష్యాకు వెళ్లడానికి ప్రయత్నం చేసి యుద్ధ విమానంలో ప్రయాణించిన సుభాష్ చంద్రబోస్​తైవాన్​లోని తైపే విమానాశ్రయంలో దురదృష్టవశాత్తు విమానం కూలిపోయిన ప్రమాదంలో మరణించారని రకరకాల కమిషన్లు తెలిపాయి. కానీ, నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.ఆంగ్లేయులు మన దేశం వదిలిపెట్టి వెళ్లిపోయారంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ వారిని ఎంత భయపెట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. మనమందరం సుభాష్ చంద్రబోస్ అనగానే ఆయన మరణం ఎలా జరిగిందో తెలియలేదు అనే మిస్టరీని మాత్రమే చదివి ఊరుకుంటాం కానీ ఆయన జీవితంలో చేసిన  చరిత్ర గుర్తుచేసుకోవాలి.  రాబోయే తరాలకు ఆదర్శవంతమైన నేతాజీ చరిత్రను అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-  శ్రీ భారతి ఉల్లెంగ ముత్యం తెలుగు రీసెర్చ్​ స్కాలర్​, కేయూ.