
- నెట్‌ఫ్లిక్స్.. పక్కా లోకల్
- ఇందు కోసం స్పెషల్ టీమ్
- మాస్ హిందీ సినిమాల రైట్స్ కొనుగోలు
న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ పేరు చెబితే మనకు గుర్తుకొచ్చేవి క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్, ఇంటర్నేషనల్ మూవీస్, వెబ్‌సిరీస్‌లు. వీటిలో అర్బన్, అడల్ట్ కంటెంట్ ఎక్కువ. క్లాస్ ఆడియెన్స్ సినిమాలే ఎక్కువగా ఉంటాయని, మాస్ మెచ్చేవి తక్కువనే విమర్శలూ ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఇట్లాంటి వాదనలను ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదు. తాము అన్ని వర్గాలకూ నచ్చే సినిమాలను ఇస్తామని, పాన్ ఇండియా మూవీస్‌పై ఫోకస్ చేస్తామని చెబుతోంది.
తమది కేవలం ‘అర్బన్ సెంట్రిక్’ ఓటీటీ అనే విమర్శలో నిజం లేదని, లోకలైజేషన్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ మోనికా షేర్గిల్ అంటారు. నిజానికి తమకు అర్బన్ ఆడియెన్సే తక్కువగా ఉంటారని చెప్పారు. ‘‘నేను మూడేళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో చేరాను. అప్పటి నుంచి మేం అందించిన సినిమాలను చూడండి.
అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వీటిలో డార్లింగ్స్', 'మిషన్ మజ్ను', 'మోనికా, ఓ మై డార్లింగ్', 'ఖాకీ,' 'రానా నాయుడు','కోటా ఫ్యాక్టరీ'లు పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్. గంగుబాయి కఠియావాడీ, డార్లింగ్స్ వంటి సినిమా రియల్ లైఫ్ స్టోరీలు. ఇవన్నీ అందరికీ నచ్చుతాయి. ఇండియన్ ప్రిడేటర్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్ వంటి క్రైం షోలూ ఆదరణ పొందాయి” అని ఆమె వివరించారు.
దేశీ ప్లాన్స్...
మనదేశంలో నెట్‌ఫ్లిక్స్‌లో 61 లక్షల మంది వరకు కస్టమర్లు ఉన్నారు. దీని పోటీ కంపెనీలు హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌తో పోలిస్తే దీనికి ఉన్న వ్యూయర్ల సంఖ్య తక్కువ. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ చార్జీలు ఎక్కువ. తన వ్యూయర్షిప్ను మరింత పెంచుకోవడానికి లోకల్, గ్రామీణ ప్రాంతాలకు నచ్చే కంటెంట్‌ను కూడా భారీగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. వీరికి నచ్చే కథల వేటలో పడింది.
అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది కాబట్టి ఫోన్లకు ప్రత్యేకంగా టారిఫ్‌లను తెస్తోంది. కొన్ని ప్లాన్ల ధరలను తగ్గించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి ‘యాడ్స్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్’ సదుపాయాన్ని కూడా తెస్తోంది. ప్రకటనలు ఇచ్చే ప్లాన్ల ధరలను తగ్గించనుంది. మాస్ ఆడియెన్స్‌కు నచ్చే కంటెంట్‌పై ఫోకస్ చేస్తోంది.