నెట్‌ఫ్లిక్స్ (Netflix) ప్లాట్‌ఫామ్ మరో వినూత్న ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. భారతదేశపు మొట్టమొదటి క్లైమేట్ స్క్రిప్ట్‌రైటింగ్ ల్యాబ్ (Climate Scriptwriting Lab)ను నెట్‌ఫ్లిక్స్ ప్రారంభించింది. క్రియేటివ్ ప్లాట్‌ఫామ్ అయిన పీపుల్ లైక్ అస్ క్రియేట్ (PLUC.tv) తో కలిసి స్క్రిప్ట్‌రైటింగ్ ల్యాబ్‌ను ఏప్రిల్ 9, 2026న న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, గౌహతి నగరాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించనుంది. డాక్యుమెంటరీలకు మించి ఉండేలా, క్లైమేట్ కథలను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నం చేయనుంది నెట్‌ఫ్లిక్స్.
ఈ క్రమంలోనే హైబ్రిడ్ ప్రోగ్రామ్ ద్వారా వాతావరణ మార్పులపై కథలను రూపొందించేందుకు 60 మంది రైటర్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం లక్ష్యం పెట్టుకుంది. ఆసక్తి ఉన్నవారు climatescriptwriting.com ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం:
వాతావరణ అంశాలను కేవలం డాక్యుమెంటరీలకు మాత్రమే పరిమితం చేయకుండా, సాధారణ కథల్లో సహజంగా చేర్చేలా రచయితలను ప్రోత్సహించడం. ఎంపికైన రచయితలకు ఎనిమిది నెలల పాటు మార్గదర్శకత్వం అందించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ మహిమా కౌల్ మాట్లాడుతూ, భారతదేశంలో వాతావరణ కథలకు కొదువ లేదని, కానీ వాటిని వాటిని అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాల్లోకి తీసుకురావడానికి సరైన వేదిక అవసరమని తెలిపారు. PLUC వ్యవస్థాపకురాలు తమ్సీల్ హుస్సేన్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఈ ల్యాబ్‌కు ప్రముఖ రచయితలు మార్గదర్శకత్వం వహించనున్నారు. వీరిలో హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలైనా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (2023), గెహ్రాయాన్ (2022), మరియు హోమ్‌బౌండ్ వంటి ప్రాజెక్ట్ లకు స్క్రిప్ట్ అందించిన సుమిత్ రాయ్ ఉన్నారు. అలాగే అక్షత్ వర్మ, సాయివిన్ క్వాడ్రాస్ వంటి సినీ రైటర్స్ సైతం పనిచేయనున్నారు.
