T20 World Cup 2024: భయపెడుతున్న అసోసియేట్ జట్లు.. నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి

T20 World Cup 2024: భయపెడుతున్న అసోసియేట్ జట్లు.. నెదర్లాండ్స్ చేతిలో శ్రీలంక ఓటమి

టీ20 ప్రపంచకప్ అసలు పోరు మొదలు కాకముందే మజా తెప్పిస్తోంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ అసోసియేట్ జట్లు.. అగ్రశ్రేణి జట్లను భయపెడుతున్నాయి. నెదర్లాండ్స్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో శ్రీలంక ఓటమి పాలయ్యింది. లంకేయులు పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగినప్పటికీ కనీసం విజయం అంచుల వరకూ కూడా చేరుకోలేకపోయారు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ మైఖేల్‌ లెవిట్‌ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడగా.. డచ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్(27) విలువైన పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో లంక 30 పరుగులలోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు బ్యాట్ ఝుళిపించలేకపోయారు. చివరకు 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్‌ ముగిసింది.

హసరంగ మెరుపులు

లంక కెప్టెన్‌ వనిందు హసరంగ ఇన్నింగ్స్‌ చివరలో బ్యాట్ ఝులిపించాడు. 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులోవరుసగా ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. లంక బ్యాటర్లలో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్‌ షనక (35 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. డచ్ బౌలర్లలో ఆర్యన్‌ దత్‌ 3 వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టగా.. కైల్‌ క్లెయిన్‌ 2, లొగాన్‌ వాన్‌ బీక్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

బంగ్లాతో ఢీ

ఈ టోర్నీలో భారత జట్టు.. బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది.  జూన్ 1న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న పలువురు టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నారు.